– ఇప్పటికే అనేక సమస్యలను గుర్తించాం
– త్వరలో మధ్యంతర నివేదిక
– ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ధరణిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందనీ, సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ధరణి కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.కోదండరెడ్డి తెలిపారు. సోమవారం సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కమిటీ ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలపై లోతుగా అధ్యయనం చేస్తున్నదనీ, ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారంపై సాధ్యమైనంత త్వరగా వధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు. ఈ రంగంలో నిష్ణాతులైన ఎంపిక చేసిన నలుగురైదుగురు కలెక్టర్లతో ఈ నెల 24 సమావేశం ఏర్పాటు చేసి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్టు తెలిపారు. ఆర్డీవో, ఎమ్మార్వోలతో పాటు భూ సమస్యలతో సంబంధమున్న వ్యవసాయ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తదితర శాఖలతో సమావేశం కానున్నట్టు చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులతో పాటు అన్ని పక్షాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని రెవెన్యూ విధానాలను సైతం అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. 2014కు ముందున్న రెవెన్యూ విధానాన్ని కాదని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పోర్టల్ తప్పిదాల వల్ల కొంత మంది రైతులు తమ భూ హక్కును కోల్పోయారనీ, ఫలితంగా వారికి రావాల్సిన రాయితీలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ మాట్లాడుతూ ధరణిలోని సమస్యలను తాత్కాలిక, దీర్ఘకాలిక అని రెండు రకాలుగా విభజించామన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలకు పరిష్కారాలు కనుగొని తగిన సిఫార్సులను ప్రభత్వానికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మధుసూదన్, సునిల్, లచ్చిరెడ్డి పాల్గొన్నారు.