ఎందుకలా
ప్రతిదానికీ
నెత్తీ నోరూ కొట్టుకుంటూ
తెగ బాధపడిపోతావు
ఎవ్వరేమీ పట్టించుకోరు
ఈ లోకం బాగా మలినం పట్టిన
దుస్తులు ధరించి వుంది
ఈ దేహం మొత్తాన్ని
చేతులుగా మలిచి ఉతికినా తెలుపు రాదు
నీ చేతులెంత పొడవైనవైనా
మురికి దుస్తుల విస్తీర్ణం ఇంకా పెద్దది
కాగితాల మీద
పిచ్చిగీతలు గీసి
గాలిలోకి ఎగరేస్తారు వాళ్లు
వాళ్లగీతొక్కటి చక్కగుంటే చాలు
లోకమేమైనా ఫర్వాలేదని
నిర్ణయించుకున్నవాళ్లు
వాళ్ల నోటికి ముద్దందితే చాలు
ఎన్ని ఆకలి కడుపులు పేలిపోయినా
పట్టించుకోరు వాళ్లు
ఎందుకలా
నువ్వొక్కడివే నెత్తీ నోరూ కొట్టుకుంటూ
తెగ బాధపడిపోతుంటావు
నీకు నువ్వే అనవసరంగా
బీపీ పెంచుకుంటావు
ఉన్నఫలంగా నువ్వాశించినట్టు
లోకమేమీ మారిపోదు
మంచిని స్వప్నించేవాళ్లను
పిచ్చివాళ్లుగా ముద్రించి
నవ్వుకుంటుందీ లోకం
అయితే
వాళ్లు నిర్లక్ష్యంగా
రాజేసిన మంటల్లో
వాళ్లే మిడతల్లా కాలిపోతున్న దృశ్యం
నీ కంటపడుతుందొకరోజు
వాళ్లను చూసి నువ్వు
జాలిపడతావంతే
వాళ్లెప్పటికీ కళ్లు తెరవరు
అప్పటికే వారి కనురెప్పలు పూర్తిగా
కాలిపోయుంటాయి.
చిత్తలూరి, 9133832246
కాలిన కనురెప్పలు
- Advertisement -
- Advertisement -



