Sunday, September 20, 2026
E-PAPER
Homeదర్వాజనగ్నముని ‘జైల్లోసముద్రం’ కవిత నేటికీ ప్రాసంగికమే...

నగ్నముని ‘జైల్లోసముద్రం’ కవిత నేటికీ ప్రాసంగికమే…

- Advertisement -

ఉదాత్తమైన ఆలోచనల్తో, విశ్వమానవ శ్రేయస్సుకోసం మావత్వాన్ని కీర్తిస్తూ రాయబడిన కవిత్వాన్ని విశ్వజనీన కవిత్వంగా పరిగణించవచ్చు. ఏ కులమతాలతోనూ నిమిత్తం లేకుండా, ఒక స్పష్టమైన తాత్విక అవగాహనతో సామాజిక చైతన్యం కోసం రాసే కవుల కవిత్వం కాలాతీతంగా నిలబడి నిత్యచైతన్య శీలమైన ప్రభావం చూపిస్తుంది. అటువంటి కవుల కోవలోకి వచ్చే బలమైన, ప్రభావశీలమైన అత్యంతాధునిక కవి నగ్నముని. తెలుగుసాహిత్య ప్రపంచంలో నగ్నమునిగా సుప్రసిద్ధులైన మానేపల్లి హృషీకేశవరావు దిగంబర కవిత్వావిర్భానికంటే ముందే కవిగా సుప్రసిద్ధులు. వారి తొలి కవితాఖండిక ‘సౌందర్యపుస్వగతం’ 1957 నవంబర్ తెలుగు స్వతంత్ర మాసపత్రికలో ప్రచురించబడింది. తరువాత వారు తన మొదటి కవితాసంపుటి ‘ఉదయించని ఉదయాలు’ పేరుతో 1962లో ప్రచురించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నగ్నముని సాహిత్యరంగంలోని వివిధ ప్రక్రియల్లో ప్రతిభావంతమైన రచనలు చేశారు. నటునిగా, నాటకకర్తగా, ప్రయోక్తగా కూడా పనిచేశారు. 1959 సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాలు రేడియో ప్రసారం చేసిన పలు నాటికలలో, నాటకాలలో వివిధ పాత్రలు పోషించారు. ఆయన రాసిన ‘కొయ్యగుర్రం’ ఆధునిక మహాకావ్యంగా పేరుతెచ్చుకొని దీర్ఘకవితకు ఒరవడి పెట్టినది. 1977 నవంబరులో ఆకాశవాణిలో ప్రసారం కావింపబడి1978 జనవరిలో ప్రజాతంత్ర వారపత్రికలో ప్రచురించబడింది. ‘కొయ్యగుర్రం’ 1980లో గ్రంథరూపం దాల్చినప్పటినుంచి, ఇప్పటివరకు రష్యన్, ఇంగీషు, హిందీ, పంజాబి, కన్నడ, తమిళ భాషల్లోకి అనువదింపబడటమేకాక, కన్నడ అనువాదానికి పురస్కారం పొందింది.

అంత్యంతాధునిక కవితగా పేరుపొందిన ‘జైల్లోసముద్రం’ కవిత దిగంబరకవులు వెలువరించిన మొట్ట మొదటి కవిత్వసంకలనంలో ప్రచురించబడి నగ్నమునికి ప్రతిభావంతమైన కవి అనే పేరు ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. ఈ కవిత అప్పటి సమకాలీన సంఘటనలకి ప్రతిబింబంగా, నగ్నముని వ్యక్తిగత అంతర్మధనంలోంచి పెల్లుబికిన ప్రభావవంతమైనదిగా పాఠకుల, విమర్శకుల దృష్టిని ఆకర్షించించింది. ‘జైల్లోసముద్రం’ కవిత అందర్నీ అంతలా ఆకర్షించటానికి కారణం ఆనాటి ఆధునిక సమాజంలోని నిరాశా నిస్పృహల్ని, అస్తిత్వ సంవేదనల్ని, రోజురోజుకూ దిగజారిపోతున్న మానవతా విలువల్ని, మానవ మస్తిస్కాల్లో కమ్ముకుంటున్న విషాదాన్ని అద్భుతమైన ప్రతీకల్తో కవితాగానం చేయడం మూలాన. అధివాస్తవిక వ్యక్తీకరణతో మొదటి పాదాల్లోనే ఇలా మొదలవుతుందీ కవిత.‘‘సూర్యుని కడ్డంగా నుంచున్న/ ఆ మబ్బుతునక పేరేమిటి/ అర్థం కాని అనంత శూన్యం అంచు మీదకి/ ఆకారంలేని కుర్చీనొకటి లాక్కుని/ అర్థవంతమైన బ్రతుకు వెన్నెల/ చుక్కల్ని కప్పులో వొంపి/ ఒక్కొక్క క్షణం పెదవుల కానించి/ విషాదాన్ని ఆరాధిస్తూ ఉంటానా…’’

ప్రశ్నతో మొదలయ్యే పై కవితా వాక్యాలు కవి అత్యంత భావతీవ్రతకు, అద్భుతమైన ఊహాషాలీనతకు అద్దం పట్టడమేకాక, కవి ప్రశ్నించే తత్వాన్ని, నిరసన తెలిపే గుణాన్ని తెలియపరుస్తాయి. “సూర్యుని కడ్డంగా నుంచున్న ఆ మబ్బుతునక పేరేమిటి” అనే కవితావాక్యంలో ‘సూర్యుడు’ వెలుగుకి, అభివృద్ధికి సంకేతమయితే! సమాజంలో సమస్త జనావళికి అందవలసిన సంక్షేమ పధకాల్ని, ప్రయోజనాల్ని వాళ్ళకు చెందవలసిన హక్కుల్ని ఎవరో మధ్యలో వాళ్ళకు అందకుండా అడ్డుకుంటున్నారని కవి భావన. “అర్ధంకాని అనంత శూన్యం అంచుమీద ఆకారం లేని కుర్చీలో కూర్చోవటం”… అర్థవంతమైన బ్రతుకు వెన్నెల్ని తాగుతూ విషాదాన్ని ఆరాదించటం అనే ఆలోచన ఆధునిక కవితాభివ్యక్తిలో అత్యంత గొప్పవ్యక్తీకరణ.ఈ కవితలో ‘జైలు’ అనేది నిర్భంధానికి సంకేతం. జైల్లో బంధించబడిన ‘సముద్రం’ అనే బలమైన రూపకంతో మనిషి స్వేచ్ఛపై ఆధునిక సమాజం విధిస్తున్న ఆంక్షలను చూపిస్తాడు. సముద్రం అంటే అనంతమైన స్వేచ్ఛకు, అంతంలేని భావోద్వేగాలకు సువిశాల విస్తీర్ణతకు ప్రతీక. అటువంటి స్వేచ్చా, స్వాతంత్ర్యాలను హరించే ప్రయత్నం జరుగుతుందంటే, మనిషి వ్యక్తిగత భావాలను, స్వేచ్ఛను, అస్తిత్వాన్ని బంధించడమే అవుతుంది.

ఈ ఆధునిక సమాజంలో రోజురోజుకు అర్థం కాకుండా పోతున్న జీవితాన్ని, మానవత సంక్షోభానికి గురౌతున్న వైనాన్ని, కవితాత్మకంగా ఒక త్వాత్విక గాఢతతో ‘జైల్లోసముద్రం’లో ప్రతిబింబిస్తాడు. వాస్తవానికి ఊహకు మధ్యలో ఊగిసలాడుతూ, కాలానికి భయపడే మనుషుల ఓటముల్ని అద్భుతమైన పదచిత్రాల్తో కవిత్వం చేస్తాడు. దిగజారిపోతున్న విలువల్ని, ఆధునిక మానవుని దుస్థితిని అత్యంత భావ తీవ్రతతో ఈ అధివాస్తవిక కవితలో వాపోతాడు.. ముఖ్యంగా మనిషి తన గురించి తనకు తానుగా తెలుసుకొని వ్యక్తిగత జీవనానుభవ సారాన్నుంచి సామాజిక స్థాయికి విస్తరించాలని కోరుకుంటాడు. ఈ గంభీరమైన కవిత ముఖ్య ఉద్దేశ్యం మనిషి తన గురించి తాను తెలుసుకుంటూ, జీవిత అర్థాన్ని తెలుసుకుంటూ, తద్వారా సమాజాన్ని అర్ధం చేసుకోవాలనే ప్రయత్నం చేయడం. సమాజంలో మనుషుల భావాలు, వాళ్ళ స్వేచ్చ రకరకాల ఆంక్షలు ఉండటాన్ని కవి ఈ కవిత ద్వారా నిరసిస్తాడు. రోజురోజుకూ నాశనమైపోతున్న మానవతా విలువల్ని, మతాల మధ్య సంఘర్షణల్ని, నానాటికీ దిగజారిపోతున్న రాజకీయ వ్యవస్థల్ని, ఎప్పటికీ నెరవేర్చని వాగ్ధానాల్ని, రాజకీయ నాయకులు ఇచ్చే ఊకదంపుడు ఉపన్యాసాల్ని ఈ ‘జైల్లోసముద్రం’ కవి సంకేతాత్మక పదచిత్రాలతో, అద్బుతమైన భావచిత్రాలతో, అత్యంత భావాత్మకమైన వాక్యనిర్మాణంతో పాఠకుల్ని ఆలోచింపచేస్తాడు. ఆనాటి గందరగోళ, అస్తవ్యస్తమైయున్న సామాజిక స్థితిగతులకు ఈ కవిత అద్దంపడుతుందనటలో ఈ కింది కవిత్వపాదాలే బలమైన నిదర్శనం..

‘‘రూపాయి నోట్లో తలదూర్చి తన్నుకుంటున్నలోకంలా/ సీసాలో బంధించుకుంటున్న ఆధునిక మానవుడి రూపంలా/ ఎప్పటికీ నాకర్థం కానిది ఈ అద్దం/ తానెవరో అర్థమై/ ఊపిరి ఊనికి తెలిసిన చోట/ ఈ అద్దాన్ని అమర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటానా..’’ ఈ ‘జైల్లోసముద్రం’ అనే కవితలో స్వేచ్ఛకి సంకేతమైన సముద్రాన్ని తీసుకొని మానవ భావోద్వేగాలను, భావస్వేచ్ఛను జైల్లో బంధించినట్లుగా కవిత్వీకరిస్తాడు. ఆధునిక సమాజంలోని మానవ విలువల హీనతను, నిరాశా నిస్పృహల్తో జీవితాన్ని కొనసాగిస్తున్నమనుషుల ప్రవర్తనని అసత్యం, అద్ధం, సముద్రం, జైలు, అస్తిపంజరం లాంటి రకరకాల ప్రతీకల్తో వ్యక్తపరుస్తాడు. ‘సముద్రం’ స్వేచ్చకీ సంకేతమైతే! ‘జైలు’ నిర్భందానికి సంకేతం. అలాగే కవి ఈ కవితలో వాడిన ఇంకో బలమైన సంకేతం ‘అద్దం’. అద్దం మనకి మన రూపం చూపించటమే కాక మన అంతరంగాన్ని చూసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని తెలిపే పారదర్శక సాధనం కూడా. ముఖ్యంగా ఈ కవితలో కవి ఆధునిక మనుషుల్లో కనిపించే రకరకాల భావోద్వేగాల్ని వ్యక్తపరుస్తాడు.

మనిషి స్వేచ్ఛకోసం తపించడాన్ని, పతనమైపోతున్న విశ్వాసాల్ని, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని, కృత్రిమత్వం వల్ల కలిగే విసుగును, మానవసంబంధాల్లో ఏర్పడుతున్న వెలితిని, కాలానుగుణంగా మారలేని మనిషి పడే మానసిక ఆందోళనని. సమాజంలో పేరుకుపోయిన అనిశ్చితికి, అస్పష్టతకి మనిషి జీవితాంతం అర్థాన్ని వెతుతూనే ఉంటాడు. మానవతా విలువల్ని కోల్పోయిన మనిషి యంత్రంలా మారిపోయి స్వేచ్ఛకోసం నిత్యం ఆరాటపడుతుంటాడు. ఆనాటి ఆధునికులు మానవత్వంతో మనుషులుగా బతకలేని అశక్తతని, నానాటికీ వాళ్ళల్లో మాసిపోతున్న మానవతత్వాన్ని గుర్తుచేస్తూ కృత్రిమత్వాన్ని వదిలేసి సహజంగా, సజీవంగా జీవించే స్వచ్చమైన మానవుని కోసం కవి పడే ఆవేదన, తపన ఈ కవితలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘జైల్లోసముద్రం’ కవితను నగ్నముని ఆనాటి సమాజంలోని ఏ ఏ విషయాల్ని చూసి స్పందించి రాశారో కానీ, ప్రస్తుత సమాజాన్ని కూడా ప్రతిబింబించే ఇంత అజరామరమైన, ఆలోచనాత్మకమైన ఈ కవితకు 60 సంవత్సరాలు నిండిన సంధర్భంగా ఆ మహాకవికి నేనందించే వ్యాసకానుక.

ప్రొ. బాణాల శ్రీనివాసరావు, 9440471423

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -