Monday, September 21, 2026
E-PAPER
Homeదర్వాజ‘చివరి బహుమతి’లో వలస జీవిత చిత్రం

‘చివరి బహుమతి’లో వలస జీవిత చిత్రం

- Advertisement -

అబ్దుల్ రజాక్ గుర్నా రచనల్లో చిత్రించిన ఆఫ్రికాలోని నూతన స్వతంత్ర దేశాల్లో అధికారం, అవినీతి మధ్య సంబంధంలో వలసవాద వారసత్వ పాత్ర ఉందని గుర్నా భావించారు. వలసవాదులు నూతన స్వతంత్ర దేశాల్లో అవినీతి నేతలను ప్రోత్సహించి, తమకు అనుకూల నియంతలను గద్దె నెక్కించి తిరిగి మళ్ళా అవినీతి అనేది ఆఫ్రికన్ దేశాల ప్రజల అనివార్య విధిగా చిత్రించారు. తోటి ఆఫ్రికన్ రచయితలైన చినువా అచేబీ, గూగీ, సోయింకాల రచనల్లో కూడా వలసవాద వ్యతిరేకం నిరసన ఉంది. అయితే గూగీ ఒక దశలో పూర్తిగా వలసవాద ప్రభావం తిరస్కరించి సొంత భాషలో రాశారు. అచేబీ, గుర్నాలు మాత్రం ఇంగ్లీషు భాషలోనే రాసినా, ఆ సంప్రదాయానికి కట్టుబడినా గత స్మృతులు, స్థానిక సత్యాలకు దూరం కాలేదు. అబ్దుల్ రజాక్ గుర్నా నవల ‘చివరి బహుమతి’ ఒక వలస కుటుంబం కథను చిత్రీకరిస్తుంది. నవలలో కథనం అబ్బాస్ స్మృతుల ద్వారా ముందుకు, వెనక్కు సాగుతుంది. తమకు నచ్చిన జీవితం సాధించడం కోసం పిల్లలు ఎదుర్కొనే కష్టాలు, బిన్న జాతులు, తరాల మధ్య అంతరాలు, జాతి అపోహలు, శరణార్థుల ఇక్కట్లు ఈ నవలలో వర్ణించబడ్డాయి. మూడో వ్యక్తి గొంతు ద్వారా, స్మృతులు, కలలు, ఉత్తరాల ద్వారా వలస జనుల సున్నితమైన, దయనీయ, రహస్య, పోరాట భరిత జీవిత చిత్రణ ఈ నవలలో కనిపిస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో వలసజీవులు గతంతో, వర్తమానంతో పడాల్సిన రాజీలో ఆవేదన కూడా ఆసక్తికర శైలిలో రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా రాశాడు.

అబ్బాస్ గతంలో ఒక నావికుడు, ఫిట్టర్, ఇంజనీర్‌గా పనిచేశాడు. అతని భార్య మర్యామ్ ఒక అనాధ. తన పెంపుడు తల్లిదండ్రులు ఫిరూజ్, విజ‌య్‌‌లను వదిలి వచ్చేస్తుంది. ఆమె ఒక హాస్పటల్లో క్లీనర్‌‌గా పని చేస్తుంటుంది. ఒకరోజు డయాబెటిస్‌‌తో తీవ్ర అస్వస్థతకు గురైన అబ్బాస్‌‌ను చూసేందుకు వారి ఇద్దరు పిల్లలు హన్నా, జమాల్ తమ ఇంటికి వస్తారు. అన్నాకి స్వతంత్ర జీవితం అంటే ఇష్టం. జమాల్‌‌కు సృజనాత్మక జీవన విధానంపై మక్కువ. జాంజిబార్‌‌లో జన్మించిన అబ్బాస్ గత జీవితంలో బాల్యంలో పేదరికం, తన తండ్రి పిసినారితనం, తోబుట్టువుల సాయంతో చదువు, కాలేజీ రోజుల్లో ప్రేమ వివాదం, పెళ్లి తరువాత భార్య షరీఫా కుటుంబం చేతిలో అవమానాల వల్ల భార్యా, బిడ్డలను వదిలి పలు దేశాల్లో పర్యటించడం, చివరికి లండన్ చేరి మర్యామ్‌‌తో వివాహం జరుగుతాయి. ​రెండో తరానికి చెందిన హన్నా తన స్నేహితుడు నిక్ కోసం తన ఉద్యోగాన్ని వదిలి అతడి కోసం యూనివర్సిటీకి వెళుతుంది. ఆమె కలలు అభద్రతకు లేదా అపరాధ భావనకు ప్రతీక అయి ఉండవచ్చు అని నిక్ ఆమెతో చెబుతాడు. నిక్‌‌తో పెళ్లి అయిన తర్వాత ఆమెలో అనుమానాలు రేకెత్తుతాయి. కాల క్రమంలో నిక్‌‌కు జూలియాతో సంబంధం గూర్చి హన్నా అతడ్ని నిలదీస్తుంది. అతడి ఆధిపత్య స్వభావం గుర్తించిన హన్నా తన సొంత జీవితాన్ని వెతుక్కుంటుంది.

ఇక అన్నా సోదరుడు జమాల్ తొలుత అవిశ్వాసిగా ఉంటాడు. కానీ 9 /11 సంఘటనల తర్వాత విశ్వాసిగా మారి పోతాడు. పాలస్తీనా, కాంగో, చెచెన్యాలలో ముస్లిం ప్రజల మనోస్థితిని అర్థం చేసుకుంటాడు. ఇంకా ఈ నవలలో జమాల్ ద్వారా రచయిత 1968 విద్యార్థి ఉద్యమాలు, ఇరాక్ యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చూపిస్తాడు. తమ తండ్రి అబ్బాస్ ప్రగాఢమైన మౌనం పిల్లలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ​అబ్బాస్ భార్య మర్యామ్ జబ్బు పడిన తన భర్తను చూసుకుంటూ ఉంటుంది. తన ఉద్యోగం పోయిన తర్వాత ఆమె శరణార్థుల కేంద్రంలో చేరి వారి బాగోగులకు అంకితం అవుతుంది. భర్త గత జీవితంలో జరిగిన వైవాహిక రహస్యం తెలిసి మర్యామ్ నిశ్శబ్దంలో మునిగిపోతుంది. ఒక దశలో ఆమె తన పిల్లలతో తన గతాన్ని చెబుతుంది. భర్త పోయిన తరువాత మర్యామ్ తన పెంపుడు తల్లిదండ్రులను కలుస్తుంది. తాను ఓ పోలిష్ వనితకు, రంగుజాతీయుడైన బ్రిటిష్ సైనికునికి పుట్టిన సంతానం అనే నిజం ఆమెకు తెలుస్తుంది. మర్యామ్ ఒక యూదు తండ్రికి పుడితే ఆమె పేరు మిరియాముగా మారేది. పేరులో ఒక అచ్చు మారితే ఆమె జాతి కూడా మారుతుంది. హన్నా పేరును కూడా రచయిత ‘అన్నా’ అని ఆమె ఇంట్లో లేదా బయట ఉండే ప్రదేశాన్ని బట్టి మారుస్తూ ఉపయోగిస్తాడు.

​ ఈ నవలలో కుటుంబ సభ్యుల మధ్య నిశ్శబ్దాలు, గత జీవితం వల్ల కలిగే అపరాధ భావన, అనుమానాలు మానవ సంబంధాల్ని దెబ్బతీయటం చూస్తాం. రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా వలస కుటుంబాల రక్షణాత్మక ప్రవర్తన, గతంతో వారి ఘర్షణ, దానిని వక్రీకరణ చేయవలసిన స్థితిలో వారిలో కలిగే ఒత్తిడి, తమ అశాంతిని దాచుకునే ప్రయత్నాలు ఇవన్నీ చిత్రిస్తాడు.
నవల చివరలో హన్నా తన స్వేచ్ఛ జీవితానికి సిద్ధమవడం, వారి తల్లి తిరిగి చురుకైన జీవితం ప్రారంభించటం, జమాల్ తాను రాయబోయే కథను గురించి ప్రస్తావన తెలుస్తుంది. అబ్బాస్ తన కథ చరిత్రను టేప్ చేసి తాను చనిపోయే ముందు పంపడంతో కూతురుకు తన తండ్రి నిజాయితీ, ఒంటరితనం తెలిసి అతని పట్ల సానుభూతి కలుగుతుంది. ఇదే అతడు ఆమెకి ఇచ్చిన ‘చివరి బహుమతి’. ​అబ్దుల్ రజాక్ గుర్నా నవలల్లో ‘డిసర్షన్’, ‘మెమరీ ఆఫ్ డిపార్చర్’, ‘పిలిగ్రీమ్స్ వే’, ‘పారడైజ్’, ‘అడ్మైరింగ్ సైలెన్స్’, ‘బై ది సీ’, ‘గ్రావెల్ హార్ట్’, ‘ది లాస్ట్ గిఫ్ట్’ ప్రఖ్యాతి పొందాయి.
2021 లో నోబెల్ బహుమతి గ్రహీత గుర్నా తన నోబెల్ ఉపన్యాసంలో సద్గుణాలు, వికారాలు రెండింటినీ చెప్పే సత్యం రాయటంలో మనిషి సాదాగా, నమూనాగా కనపడడు అని అన్నారు. మంచి రచనలో అందం ఉందని, దాని వల్ల సున్నితత్వం, బలహీనతలకు, క్రూరత్వం మధ్య ఆర్ద్రతకు, కరుణకు చోటు ఉన్నందున సాహిత్య నిబద్ధుడ్నిఅయ్యానని తెలిపారు.

డా.జె.రవీంద్రనాథ్, 8978131585

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -