నవతెలంగాణ – హైదరాబాద్: తాను వాళ్లూ వీళ్లూ వదిలిన బాణాన్ని కాదని, దశాబ్దాలుగా అధికారానికి, విద్యకు దూరంగా ఉన్న బహుజనుల బాణాన్ని అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆదివారం కొడంగల్‌లో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..”నన్ను కాంగ్రెస్ వదిలిన బాణమని బీఆర్‌ఎస్ వాళ్లు, కేసీఆర్ వదిలిన బాణమని రేవంత్‌రెడ్డి అంటున్నారు. మరికొందరు తలకాయ లేనివాళ్లు బీజేపీ బాణమని మాట్లాడుతున్నారు. కొడంగల్ గడ్డపై నుంచి నేను ఒక్కటే చెబుతున్నా. నేను తెలంగాణ బహుజనుల బాణాన్ని. యువజనుల యుద్ధ నినాదాన్ని. అంబేడ్కర్ వాదాన్ని, మహాత్మ జ్యోతిబా ఫులే ఆత్మగౌరవ నినాదాన్ని నేను” అని కవిత ఉద్ఘాటించారు.
ఒక మహిళ ఎవరి మద్దతు లేకుండా రాజకీయంగా నిలబడగలదని నిరూపించేందుకే కోడంగల్ వచ్చానని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో అక్షరాస్యత రేటు అఫ్గానిస్తాన్‌తో సమానంగా ఉందని, రాష్ట్రంలో విద్యా బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. 29 రాష్ట్రాలున్న దేశంలో కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. బహుజనులు, మహిళలు, యువత రాజకీయంగా ఎదిగేందుకు తన పోరాటం కొనసాగుతుందని కవిత తెలిపారు.



