నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ సోమవారం గ్రేసీ మాన్షన్‌లో సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన ట్రంప్.. మమ్దానీతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ఇది మూడో సమావేశం కాగా.. మమ్దానీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో భేటీ. సమావేశంలో వలసల అంశంతో పాటు న్యూయార్క్‌లో గృహ నిర్మాణ ప్రాజెక్టుపై చర్చించారు. క్వీన్స్‌లోని సన్నీసైడ్ యార్డ్‌పై 12 వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు సిటీ హాల్, వైట్‌హౌస్ బృందాలు మరింత స్థాయిలో చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి.
ఈ ప్రాజెక్టుకు 21 బిలియన్ డాలర్లకు పైగా ఫెడరల్ నిధులు అవసరమవుతాయని మమ్దానీ కార్యాలయం గతంలో పేర్కొంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. మమ్దానీపై ప్రశంసలు కురిపించారు. ఆయన గొప్ప మేయర్‌గా ఎదగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూయార్క్ ప్రజలకు ఉపయోగపడే అంశాలపై తాను ఎవరితోనైనా కలిసి పనిచేస్తానని మమ్దానీ తెలిపారు. వలసల అంశంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిపారు. అయితే ఈ అంశంపై నిర్దిష్ట నిర్ణయాలను వెల్లడించలేదు. వైట్‌హౌస్ నుంచి కొన్ని మీడియా సంస్థలను నిషేధించడంపై కూడా మమ్దానీ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛ, న్యూయార్క్ ప్రజల భద్రతకు సంబంధించిన తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినట్లు తెలిపారు.



