నవతెలంగాణ – హైదరాబాద్ : రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా ముండ్వా మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 25 వార్డుల్లో 10 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ.. ఛైర్పర్సన్ పదవిని మాత్రం దక్కించుకోలేకపోయింది. పార్టీ అధికారిక అభ్యర్థి గీతాదేవికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఆర్ఎల్పీ అభ్యర్థి అల్కాదేవి కండోయ్ 13 ఓట్లు సాధించి ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమెకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఘన్శ్యామ్ సదావత్కు 12 ఓట్లు వచ్చాయి.
దీంతో అల్కాదేవి కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ముండ్వా మున్సిపాలిటీలో బీజేపీ 10, ఆర్ఎల్పీ 7, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 5 స్థానాలు గెలుచుకున్నారు. బీజేపీకి ఛైర్పర్సన్ టికెట్ దక్కకపోవడంతో ఘన్శ్యామ్ సదావత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఆయనకు 12 ఓట్లు రావడంతో బీజేపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు పార్టీ అధికారిక అభ్యర్థికి కాకుండా ఆయనకు మద్దతిచ్చినట్లు ఫలితాలు వెల్లడించాయి. కాంగ్రెస్, ఆర్ఎల్పీకి కలిపి 10 మంది కౌన్సిలర్లు ఉండగా.. అల్కాదేవికి 13 ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచినా ఛైర్పర్సన్ పదవి దక్కకపోవడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచింది.



