– ఆరేళ్లుగా తొగుట మండల ప్రజల ఎదురుచూపులు..
– జప్తిలింగారెడ్డిపల్లి బస్సును పునరుద్ధరించాలని డిమాండ్
నవతెలంగాణ – తొగుట
మండలం ఏర్పడి 23 ఏళ్లు గడుస్తున్నా జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేక తొగుట మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* గతంలో ఉన్న బస్సు పునరుద్ధరించాలి
గతంలో నడిచిన జప్తిలింగారెడ్డిపల్లి – సిద్దిపేట బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. రోజుకు కనీసం నాలుగు ట్రిప్పులు నడిపితే తొగుట మండలంలోని పలు గ్రామాల ప్రజలకు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం బస్సు సౌక ర్యం లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, ఇతర మార్గాలపై ఆధారపడాల్సి దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
లేఖలు ఇచ్చినా.. సర్వీసు లేదు
బస్సు సౌకర్యం కోసం ఎమ్మెల్యే, ఎంపీ తదితర ప్రజాప్రతినిధులను కలిసి వినతులు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులను సంప్రదిస్తే ప్రస్తుతం జిల్లా మంత్రి, రవాణా శాఖ మంత్రి సిఫారసు తీసుకురావాలని సూచిస్తున్నారని, జిల్లా మంత్రి పట్టించుకోకపోవడం బాధాకరం అంటున్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే లు లేఖలు ఇచ్చినా బస్సు సర్వీసు ప్రారంభం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయి నుంచి ఆదేశాలు వస్తేనే సర్వీసు నడిపిస్తామని అధికారులు చెబుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
* మహిళలకు అందని ఉచిత ప్రయాణం
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నా తొగుట మండలంలోని పలు గ్రామాల మహిళలకు ఈ పథకం పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యమే లేకపోవడంతో ఉచిత ప్రయాణ పథకం ఉన్నా తమకు ప్రయోజనం లేకుండా పోతోందని మహిళలు వాపోతున్నారు.
* ధర్మారం మీదుగా సిద్దిపేటకు..
లింగాపూర్, ఎల్‌బంజేరుపల్లి, జప్తి లింగారెడ్డిపల్లి, చందాపూర్, వెంకట్రావుపేట గ్రామాల ప్రజలు సిద్ది పేట వెళ్లాలంటే ధర్మారం మీదుగా ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో ప్రయాణ దూరం 36 కిలోమీటర్లు, దాదాపు 2 గంటల సమయం పెరగడంతో పాటు అదనపు వ్యయం కూడా అవుతోందని అంటున్నారు. సరైన బస్సు సర్వీసు ఏర్పాటు చేస్తే ప్రయాణికులతో పాటు ఆర్టీసీకి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
* ఈ గ్రామాల పరిస్థితి ఏమిటి?
తొగుట, లింగంపేట, తుక్కాపూర్, కాన్గల్, ఎల్లారెడ్డి పేట, పెద్దమాసాన్‌పల్లి, బండారుపల్లి, ఘనపూర్, గుడికందుల తదితర గ్రామాల ప్రజలు కూడా జిల్లా కేంద్రానికి నేరుగా బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, అత్యవసర పనుల కోసం సిద్దిపేట వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించాలి..
మండలానికి జిల్లా కేంద్రానికి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నా రు. సంబంధిత ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి గతంలో నడిచిన జప్తిలింగారెడ్డిపల్లి బస్సును పునరుద్ధరించడంతో పాటు రోజువారీగా పలు ట్రిప్పులు నడిపే విదంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహిళలకు అందాల్సిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
* బక్క కనకయ్య, సర్పంచ్ జప్తి లింగారెడ్డి పల్లి
సిద్దిపేటకు వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. దశాబ్దాలుగా నడిచిన బస్సును నడిపించడం లేదు. మహిళలకు, వృద్దులకు పెద్ద సమస్యగా మారింది. జిల్లా కేంద్రానికి, ఆసుపత్రికి వెళ్లాల్లన్న ఇబ్బందులు తప్పడం లేదు. రవాణా శాఖ మంత్రి మన జిల్లా వారు ఉన్నారు కాబ్బట్టి చొరవ తీసుకొని సిద్దిపేటకు ప్రారంభించే విదంగా కృషి చేయాలని కోరారు.
* ఆడెపు అనూష, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధి
కాలేజీకి వెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. దుబ్బాక బస్సులో ధర్మారం వరకు వెళ్లి అక్కడ సిద్దిపేట వెళ్లేందుకు మరో బస్సుకు వెళ్ళాలి. ఇలా గంటల సమయం వృధా అవుతుంది. వెంకట్రావుపేట నుండి సిద్దిపేటకు వెళ్ళితే సమయం, దూరం తగ్గుతుంది.



