ఫిబ్రవరి లేదా మార్చిలో ఉప ఎన్నికలు
సుప్రీం తీర్పుతో మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు
గెలుపుపై ఎవరి వ్యూహాలు వారివే..అభ్యర్థులపై కసరత్తు ప్రారంభం ఈ ఉప ఎన్నికతో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టేనా…?
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు విషయంలో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడాన్ని తప్పు పట్టింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ తీర్పుతో మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), ఎం సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల), టి ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల) గుబులు పడుతున్నారు. ముఖ్యంగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. కడియం శ్రీహరిపైనా అనర్హత వేటు పడుతుందన్న ప్రచారం జరుగుతున్నది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు కూడా హైకోర్టు విచారణలో ఉన్నాయి. తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో వారున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలో మణిపూర్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలుంటాయి. అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్నది. కాగా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉండనుంది. ముఖ్యంగా 22-ఏ నిషేధిత భూములు, హైడ్రా, కరెంటు కోతలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగుల సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి అంశాలు ఉప ఎన్నికను ప్రభావితం చేయనున్నాయి. అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయా? ముందే నిర్వహిస్తారా?అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గెలిస్తేనే బీఆర్ఎస్కు భవిష్యత్తు
కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలిస్తేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నది. అందుకోసం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తున్నది. ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలని మన్నె గోవర్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ తనయుడు పి విష్ణువర్ధన్‌రెడ్డి భావిస్తున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా తన కుమారుడు తలసాని సాయికిరణ్‌యాదవ్‌ను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎవరిని పోటీ చేయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేసే అవకాశమున్నది. కాంగ్రెస్‌కు మిత్రపక్షాలు టీజేఎస్, సీపీఐ మద్దతు ఇచ్చే అవకాశమున్నది. ఈనెల 27న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఖైరతాబాద్‌లో అభ్యర్థిని నిలబెడతారా? లేక వేరే పార్టీకి మద్దతు ఇస్తారా? అనే అంశంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఇంకా స్పష్టతనివ్వలేదు.
కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ దానమే…?
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందోనన్న ప్రచారం ఊపందుకున్నది. గెలుపు తమదే అని అధికార పార్టీ అంటే కాదు.. కాదు.. తమదేనంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ చెబుతున్నది. గెలుపుపై ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఖైరతాబాద్ నుంచి సి రోహిన్‌రెడ్డి, పి విజయారెడ్డి కూడా ఆశావహులుగా ఉన్నారు. ఇంకోవైపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిపదవి ఇవ్వాలంటూ దానం నాగేందర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది. అభ్యర్థి ఎవరైనా గెలిపించే బాధ్యత తానే తీసుకుంటా నంటూ ఆయన చెప్పినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం దానం నాగేందర్‌నే పోటీ చేయించేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇంకోవైపు హైదరాబాద్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేదు. ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచింది. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా? అన్న చర్చ జరుగుతున్నది.



