జిన్‌పింగ్‌కు రెడ్‌కార్పెట్ స్వాగతం
స్వయంగా ఆహ్వానించిన ట్రంప్
వాషింగ్టన్ : వాణిజ్యం, సాంకేతికత, తైవాన్, ఇరాన్ వంటి అంశాలపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికాలో చైనా అధినేత జిన్‌పింగ్ పర్యటన ప్రారంభమైంది. అగ్ర రాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పరీక్ష పెట్టే మూడు రోజుల పర్యటన కోసం వాషింగ్టన్ చేరుకున్న జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘనస్వాగతం పలికారు. మూడు సంవత్సరాల తర్వాత అమెరికాలో జిన్‌పింగ్ జరుపుతున్న తొలి పర్యటన పెద్ద పురోగతిని అందిస్తుందన్న అంచనాలు లేకపోయినప్పటికీ ఇరు దేశాల మధ్య 11 నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాన్ని పొడిగించేందుకు అంగీకారం కుదిరింది. నవంబరులో ఈ ఒప్పందం కాలపరిమితి ముగియాల్సి ఉండగా వచ్చే సంవత్సరం జనవరి 10వ తేదీ వరకూ దీనిని పొడిగించాలని అంగీకారానికి వచ్చామని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెస్సెంట్ చెప్పారు. చైనా ఉప ప్రధాని హే లిఫెంగ్‌తో బెస్సెంట్ జరిపిన తాజా చర్చల అనంతరం ఒప్పందం పొడిగింపుపై అంగీకారం కుదిరింది.
శిఖరాగ్ర సమావేశానికి ముందు విందు
మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌కు ట్రంప్ స్వయంగా స్వాగతం పలికారు. ఒక అమెరికా అధ్యక్షుడు జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో విదేశీ నేతకు స్వాగతం పలకడం 11 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2015లో బరాక్ ఒబామా పోస్ ఫ్రాన్సిస్‌కు అక్కడ స్వాగతం పలికారు. వంద అడుగుల రెడ్‌కార్పెట్, సైనిక గౌరవ వందనం, రక్షణ విమానాల ఫ్లైఓవర్‌తో జరిగిన స్వాగత కార్యక్రమంలో ట్రంప్-జిన్‌పింగ్ కరచాలనం చేసుకున్నారు. కొద్దిసేపు ముచ్చటించుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. షెడ్యూలు ప్రకారం గురువారం రాత్రి ట్రంప్, జిన్‌పింగ్ మధ్య సుదీర్ఘ చర్చలు జరుగుతాయి. ఏఐ భద్రత-నియంత్రణలు, తైవాన్ వివాదం, ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ భద్రత, ఇరు దేశాల మధ్య సుంకాల తగ్గింపు వంటి అంశాలపై వారు చర్చిస్తారు. అంతకుముందు జిన్‌పింగ్ గౌరవార్థం ట్రంప్ దంపతులు శ్వేతసౌధంలో విందు ఇస్తారు. దీనికి ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్, ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్, టెస్లా/స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ అల్ట్‌మన్ వంటి ప్రముఖ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు హాజరవుతారు.
భాగస్వాములే…ప్రత్యర్థులు కారు
‘చైనా, అమెరికా దేశాలు భాగస్వాములుగా ఉండాలే తప్ప ప్రత్యర్థులుగా కాదు’ అని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం విడుదల చేసిన లిఖితపూర్వక ప్రకటనలో జిన్‌పింగ్ పేర్కొన్నారు. గత సంవత్సరం రెండు దేశాల మధ్య సుంకాల పోరు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పోరు ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య మూడంకెల టారిఫ్‌లకు దారితీసింది. ప్రస్తుతానికి వాణిజ్య ఒప్పందం గడువును పొడిగించినప్పటికీ అరుదైన ఖనిజాలు, కంప్యూటర్ చిప్‌లపై ఎగుమతి నియంత్రణలు, ఇరాన్-చైనా సంబంధాలు, తైవాన్‌కు అమెరికా మద్దతు వంటి పలు అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
విస్తృత వాణిజ్య ఒప్పందానికి అవకాశం
వాణిజ్య ఒప్పందం గడువును మరో రెండు నెలల పాటు పొడిగించాలని చైనా, అమెరికాలు తీసుకున్న నిర్ణయం విస్తృత స్థాయి ఒప్పందంపై కసరత్తుకు వీలు కల్పిస్తుంది. నాలుగు రోజుల వ్యవధిలో బెస్సెంట్, లిఫెంగ్ రెండుసార్లు భేటీ అయ్యారు. ‘కేవలం చిన్న విషయాలకే పరిమితం కాకుండా ఓ పెద్ద ఒప్పందం కుదుర్చుకోగలమా అని చూసేందుకు మేము ఈ రోజు సమావేశమయ్యాం’ అని బెస్సెంట్ చెప్పారు. వాణిజ్య ఒప్పందం గడువు పొడిగింపుతో ఆర్థిక రంగంలో ఏం చేయగలమో ఆలోచించేందుకు ఇరు పక్షాలకు మరింత సమయం లభించిందని అన్నారు. జనవరి 10 నాటికి ఒప్పందం కుదురుతుందా అని ప్రశ్నించగా దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు. బీజింగ్ తన అవసరాలకు అనుగుణంగా ఇరవై ఐదు టన్నుల సోయాబీన్‌ను కొనుగోలు చేస్తోందని, అయితే 17 బిలియన్ డాలర్ల విలువైన ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో వెనుకబడి ఉన్నదని చెప్పారు.
భేటీలో ఏం జరుగుతుంది ?
ట్రంప్-జిన్‌పింగ్ మధ్య జరిగే చర్చల ఫలితంగా కొన్ని రంగాలలో టారిఫ్‌ల తగ్గింపు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సహకారం, సైనిక స్థాయి చర్చల విస్తరణ వంటి అంశాలపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చైనాలో నిర్బంధంలో ఉన్న అమెరికన్లను, ఇతరులను విడుదల చేయాల్సిందిగా ట్రంప్ కోరవచ్చు. కృత్రిమ మేధ (ఏఐ)పై విస్తృత చర్చ జరిపేందుకు ఇరు దేశాలు అంగీకరించవచ్చు. సమావేశానంతరం సంయుక్త పత్రికా సమావేశానికి బదులు ఇరు దేశాలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయని అంటున్నారు. కాగా ట్రంప్, జిన్‌పింగ్ ఈ ఏడాదిలోనే మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. నవంబరులో చైనాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో కానీ, డిసెంబరులో అమెరికాలో జరిగే జీ-20 దేశాల సమావేశంలో కానీ వీరు భేటీ కావచ్చు.



