టార్గెట్‌ రంజీ ట్రోఫీ

The target is the Ranji Trophy– హైదరాబాద్‌కు రంజీ టైటిల్‌ సాధించటమే లక్ష్యం
– రానున్న రెండు సీజన్లలో టైటిల్‌ కొడతాం
– నవతెలంగాణతో హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ
భారత సీనియర్‌ జట్టు నుంచి జూనియర్‌ జట్ల వరకు అన్నింటా హైదరాబాద్‌ క్రికెటర్ల ప్రాతినిథ్యం కనిపిస్తుంది. ఏ స్థాయి క్రికెట్‌లో జాతీయ జట్టు బరిలో నిలిచినా.. అందులో ఓ హైదరాబాదీ ఆటగాడు మెరుస్తున్నాడు. జాతీయ జట్లకు ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందిస్తున్నా.. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీల్లో హైదరాబాద్‌ ఆశించిన ఫలితాలు సాధించటం లేదు. ఇటీవల హెచ్‌సీఏలో పరిపాలన పగ్గాలు మారినట్టే.. మైదానంలో ఆట సైతం మారుతున్నట్టే అనిపిస్తుంది!. రానున్న రెండు సీజన్లలో హైదరాబాద్‌ను రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలుపటమే లక్ష్యమని కెప్టెన్‌ తిలక్‌ వర్మ అన్నారు. రంజీ ట్రోఫీ ప్లేట్‌ లీగ్‌లో హైదరాబాద్‌ ఫైనల్స్‌కు చేరుకున్న సందర్భంగా భారత స్టార్‌ క్రికెటర్‌ తిలక్‌ వర్మతో ‘నవతెలంగాణ’తో ప్రత్యేక ఇంటర్వ్యూ..
నవతెలంగాణ-హైదరాబాద్‌

నిరాశకు లోనయ్యాం!
రంజీ ట్రోఫీ ఐదుసార్లు ఫైనలిస్ట్‌ హైదరాబాద్‌ ప్లేట్‌ లీగ్‌కు పడిపోవటంతో జట్టంతా నిరాశకు లోనయ్యాం. ఈ సీజన్‌ ప్లేట్‌ లీగ్‌లో ఏం చేయాలనే అంశాన్ని అందరం ఒక సవాల్‌గా తీసుకున్నాం. ప్లేట్‌ లీగ్‌లో జట్లపై విజయాలు మా లక్ష్యం కాదు. గ్రూప్‌ దశలో ప్రతి మ్యాచ్‌ను వీలైనంత వేగంగా ముగించటమే మా ప్రణాళిక. ఐదు మ్యాచుల్లోనూ అదే ఫార్ములా అమలు చేశాం. రెండు రోజుల్లోనే విజయాలు నమోదు చేశాం. ఇప్పుడు ఎలైట్‌ గ్రూప్‌లోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ్నుంచి కథ మారుతుంది.
బ్యాటింగ్‌ మెరుగుపడాలి
రంజీ ట్రోఫీలో ఎలైట్‌, ప్లేట్‌ లీగ్‌లకు ఎంతో వ్యత్యాసం. క్రికెట్‌ ఆడే స్థాయి, నాణ్యత పూర్తి భిన్నం. ప్లేట్‌ లీగ్‌ జట్లు చాలా పురోగతి సాధించాల్సి ఉంది. బౌలింగ్‌ పరంగా చూసినప్పుడు ప్లేట్‌ లీగ్‌ జట్లు మంచి పోటీ ఇవ్వగలుగుతున్నాయి. బౌలర్లు అంచనాలను అందుకుంటున్నారు. కానీ బ్యాటింగ్‌ పరంగా ఎంతో మెరుగుపడాలి.
ఆ అవకాశం కోసం చూస్తున్నా
ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేయటంతోనే నాకు భారత టీ20, వన్డే జట్లలో అవకాశాలు లభించాయి. నేను బాగా ఆడేది రెడ్‌ బాల్‌ ఫార్మాటే. ప్రస్తుతం బాగా ఆడుతున్నాను. మంచి స్కోర్లు సాధిస్తున్నాను. రానున్న సీజన్‌లోనూ ఇలాగే నిలకడగా పరుగులు చేస్తూ ఉంటే కచ్చితంగా టెస్టు జట్టులోనూ అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. అందుకోసం నేను చేయాల్సిన పని చేస్తూంటే ఉంటాను.
డ్రెస్సింగ్‌రూమ్‌లో గౌరవం
హైదరాబాద్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో నా కంటే సీనియర్లు ఉన్నారు. అయినా, కెప్టెన్‌గా నాకు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచారు. ఓ సోదరుడిగా భావించటంతో పాటు భారత్‌, ఐపీఎల్‌కు ఆడిన ఆటగాడిగా గౌరవం ఇస్తున్నారు. మ్యాచ్‌లో కొన్ని సందర్భాల్లో కాస్త కఠినంగా ఉండాల్సి వస్తుంటుంది. ఆ సమయంలోనూ సీనియర్లు అర్థం చేసుకుంటూ సహకారం అందిస్తున్నారు. డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం బాగుంది. అందుకు సహచర క్రికెటర్లకు, సహాయక సిబ్బంది, అడ్మినిస్ట్రేటర్స్‌కు ధన్యవాదాలు.
అదే అత్యంత కీలకం
ఐపీఎల్‌ భిన్నమైన అనుభూతి. అశేష అభిమానుల నడుమ ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండటం ప్రధానం. ముంబయి ఇండియన్స్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో నేర్చుకున్న విషయాలను ఇక్కడ హైదరాబాద్‌ జట్టులో సహచరులతో పంచుకుంటాను. ప్రత్యేకించి టీ20 ఫార్మాట్‌లో ఆడుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం అత్యంత కీలకం. ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్‌ అద్భుతంగా ఆడింది.
టైటిల్‌ కొడతాం
హైదరాబాద్‌ చివరగా 1987లో రంజీ ట్రోఫీ టైటిల్‌ సాధించింది. ఇన్నేండ్ల నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉన్నాం. రానున్న రెండేండ్లలో హైదరాబాద్‌ను రంజీ విజేతగా నిలుపుతాం. రంజీ ట్రోఫీ టైటిల్‌ సాధించటమే నా లక్ష్యం. హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేషన్‌, సెలక్షన్‌ కమిటీ, సహాయక సిబ్బంది నుంచి గొప్ప సహకారం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌ను రంజీ చాంపియన్‌గా చూసేందుకు ఎంతో సమయం పట్టదు.

Spread the love