– నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు
– రాజ్‌కోట్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు
– రెట్టించిన ఉత్సాహంతో ఆతిథ్య భారత్
– ఉదయం 9.30 నుంచి స్పోర్ట్స్18లో..
నవతెలంగాణ-రాజ్‌కోట్
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సవాల్ రసవత్తర దశకు చేరుకుంది. హైదరాబాద్‌లో బజ్‌బాల్, విశాఖలో స్పిన్‌బాల్ పైచేయి సాధించగా.. రాజ్‌కోట్‌లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ రెట్టింపు అవుతుంది. ఇటు వాస్తవిక పరిస్థితులను అవగాహన చేసుకుని దూసుకెళ్లాలనే టీమ్ ఇండియా మంత్ర, అటు ఎటువంటి లెక్కలు చూడకుండా దండెత్తాలనే ఇంగ్లాండ్ తంత్ర.. రెండూ ఇరు జట్లకు సత్ఫలితాలు ఇచ్చాయి. ముచ్చటగా మూడో టెస్టులో పైచేయి ఎవరిది? సిరీస్‌లో 2-1 ఆధిపత్యం కోసం భారత్, ఇంగ్లాండ్ నేటి నుంచి సమరానికి సై అంటున్నాయి.
రాజ్‌కోట్‌లో రికార్డుల వేట సాగనుంది. భారత ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500వ టెస్టు వికెట్ ముంగిట నిలువగా.. ఇంగ్లాండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ 700వ టెస్టు వికెట్‌పై కన్నేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెరీర్ 100వ టెస్టు మ్యాచ్‌ను రాజ్‌కోట్‌లో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అసమాన ప్రదర్శనలతో ఇటీవల టెస్టు క్రికెట్‌ను మరింత రక్తికట్టించిన బెన్‌స్టోక్స్ నేడు భారత్‌పై స్పెషల్ షోకు సిద్ధమవుతున్నాడు. నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు పోరు.
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఫలితాలతో పాటు వ్యక్తిగత ప్రదర్శనల్లోనూ భిన్న కోణం ఆవిష్కరించింది. పరుగుల వేటలో విరాట్ కోహ్లి, జో రూట్.. వికెట్ల వేటలో జడేజా, బెన్ స్టోక్స్ వార్తల్లో నిలవాల్సిన సిరీస్‌లో ఇరు వైపులా యువ క్రికెటర్లు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. రెండు వైపులా అనుభవలేమి క్రికెటర్లు గెలుపు ప్రదర్శనలు చేస్తూ టెస్టు సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చారు. అయితే, మూడో టెస్టులో కథ కాస్త మారనుంది. ఇరు జట్ల నుంచి సీనియర్ క్రికెటర్లు రికార్డుల వేటలో ఉండగా బెన్ స్టోక్స్, జేమ్స్ అండర్సన్, రవిచంద్రన్ అశ్విన్‌లు రాజ్‌కోట్ టెస్టులో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. ఇరు జట్లు ఇద్దరేసి పేసర్లతో బరిలోకి దిగుతున్న టెస్టులో ఆధిపత్యం కోసం అమీతుమీ ఖాయమే.
యువ మిడిల్ ఆర్డర్
విరాట్ కోహ్లి అందుబాటులో లేడు. కెఎల్ రాహుల్ గాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ ఉద్వాసనకు గురయ్యాడు. భారత మిడిల్ ఆర్డర్ ఒక్కసారిగా ఖాళీ అయ్యింది. విశాఖలో రజత్ పటీదార్ నం.4 స్థానంలో అరంగ్రేటం చేయగా.. ఇప్పుడు నం.5 స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్ పట్టనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ ఒక్కడే సీనియర్ ఆటగాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ రూపంలో యువ బ్యాటర్లు బరిలోకి దిగుతున్నారు. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచిన రోహిత్ శర్మ రాజ్‌కోట్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. అతడు వేగంగా వికెట్ కోల్పోతే.. మిడిల్ ఆర్డర్ ఒత్తిడిలో పడే ప్రమాదం ఉంది. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ శతకాలతో ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూలం. రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ జోరు ఇక్కడ చూపిస్తే భారత్‌కు తిరుగుండదు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్‌తో అదనపు బాధ్యత తీసుకోనున్నాడు. లోయర్ ఆర్డర్‌ను జడేజా ముందుకు నడిపించనున్నాడు. వికెట్ కీపర్‌గా తెలుగు తేజం కె.ఎస్ భరత్‌పై వేటు పడనుంది. ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రానున్నాడు. అశ్విన్, కుల్దీప్ స్పిన్.. బుమ్రా, సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
అతడు మెరవాలని..
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచాడు. అతడు సాధించిన పరుగులు (52) కంటే సంధించిన ఓవర్లే (64) అధికం. పరుగుల వరద పారిస్తాడని ఆశించిన బ్యాటర్.. స్పిన్ దళంలో కుదురుకున్నాడు. బ్యాటింగ్ విభాగానికి రూట్ వైఫల్యం భారంగా మారింది. సంప్రదాయ క్రికెటర్ జో రూట్.. బజ్‌బాల్ మేనియాలో సహజశైలిని కోల్పోతున్నాడనే విమర్శలు ఉన్నాయి. రాజ్‌కోట్‌లో రూట్ బ్యాట్‌తో రాణించాలని ఆ జట్టు కోరుకుంటుంది. జాక్ క్రావ్లీ, బెన్ డకెట్, ఒలీ పోప్ రాణిస్తున్నారు. జానీ బెయిర్‌స్టో స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. బెన్ స్టోక్స్ హైదరాబాద్, విశాఖలో మెప్పించే ఇన్నింగ్స్‌లు ఆడాడు. జశ్‌ప్రీత్ బుమ్రాపై ఎదురుదాడి వ్యూహంతో రానున్న ఇంగ్లాండ్ ఈ క్రమంలో వికెట్లు కోల్పోతుందా, పరుగులు పిండుకుంటుందా? చూడాలి. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ పేస్ బాధ్యతలు తీసుకోనుండగా.. టామ్ హర్ట్లీ, రెహాన్ అహ్మద్ స్పిన్ విభాగం చూసుకోనున్నారు.
ఇద్దరు అరంగ్రేటం!
భారత టెస్టు జట్టు ప్రణాళిక రహిత రూపాంతరం ముందు నిలిచింది!. పుజార, రహానెలను పక్కనపెట్టిన భారత్ పలు కారణాలతో విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సేవలు కోల్పోయింది. దీంతో ఆతిథ్య జట్టు కుర్రాళ్లపై ఆధారపడుతుంది. విశాఖ టెస్టులో రజత్ పటీదార్ అరంగ్రేటం చేయగా.. రాజ్‌కోట్‌లో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు తొలి టెస్టు క్యాప్ అందుకోనున్నారు.
పిచ్, వాతావరణం
రాజ్‌కోట్‌లో పరుగుల వరద పారనుంది. నిరంజన్ షా స్టేడియం పిచ్ స్పిన్‌తో పాటు పేస్‌కు అనుకూలం. ఇక్కడి శీతల వాతావరణం బ్యాటర్లకు, పేసర్లకు కొత్త ఉత్సాహం ఇవ్వనుంది. తక్కువ ఉష్ణోగ్రతలు స్పిన్ మాయను ఆలస్యం చేయనుంది. మూడో రోజు నుంచి స్పిన్‌కు అవకాశం ఉండవచ్చు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోనుంది. నాల్గో ఇన్నింగ్స్‌లో ఛేదన కష్టతరం కానుంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ : జాక్ క్రావ్లీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ, మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్.
100
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రాజ్‌కోట్‌లో కెరీర్ 100వ టెస్టు ఆడనున్నాడు. టెస్టు క్రికెట్లో ద్వి శతకాలు చేసిన బ్యాటర్లు 210 మంది, ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్లు 752 మంది. ఈ రెండు ఘనతలు సాధించిన 34 మంది క్రికెటర్లే కాగా అందులో బెన్ స్టోక్స్ ఒకరు.
499
భారత ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 97 టెస్టుల్లో 23.92 సగటు, 51.5 స్ట్రయిక్‌రేట్‌తో 499 వికెట్లు పడగొట్టాడు. 500 వికెట్ల క్లబ్లో అడుగుపెట్టేందుకు అశ్విన్ ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు.
33/23
ఇంగ్లాండ్ యువ స్పిన్ దళం అరుదైన ప్రదర్శన చేసింది. తొలి రెండు టెస్టుల్లో భారత స్పిన్నర్లు 38 సగటుతో 23 వికెట్లు పడగొట్టగా.. ఇంగ్లాండ్ స్పిన్నర్లు 34 సగటుతో 33 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
700
ఇంగ్లాండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్ల మైలురాయికి ఐదు వికెట్ల దూరంలో నిలిచాడు. 184 టెస్టుల్లో 26.34 సగటుతో అండర్సన్ 695 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.