జేఎన్జే హౌసింగ్‌ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్‌

– మార్చి 3న పోలింగ్‌, కార్యవర్గ ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యాక్‌ హౌసింగ్‌ సొసైటీకి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ ను ఎన్నికల అధికారి చోళా ఓంప్రకాష్‌ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సొసైటీ అడ్‌హాక్‌ బోర్డు ఛైర్మెన్‌ ముంజేటి రామారావు, డైరెక్టర్లు ఎస్‌.ఎన్‌.సి.ఎన్‌. ఆచార్యులు, పామర్తి హేమ సుందర్‌, వూకంటి శ్రీనివాస్‌ రెడ్డి, మహ్మద్‌ అబ్దుల్‌ సర్వర్‌ ఈ నెల 10న కోరారు. ఈ వినతిని ఎన్నికల అధికారి అంగీకరించి ఆ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సొసైటీ ఎన్నికలను మార్చి 3న (ఆదివారం) నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. నామినేషన్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిజాంపేట, హైదరాబాద్‌ సొసైటీ కార్యాలయంలో స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటుంది.. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మొత్తం ఐదు డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 3న పోలింగ్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 4.30 తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం కార్యవర్గ ఎన్నిక జరుగుతుంది. 981 మంది సభ్యులతో కూడిన ఓటర్ల జాబితా తనకు ఈ నెల 14న అడ్‌హాక్‌ బోర్డు అందించిందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చోళా ఓంప్రకాష్‌ తెలిపారు. సభ్యులకు ఏవైనా సందేహాలుంటే 93470 32693 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చని ఆయన వివరించారు.

Spread the love