కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు

– కాంగ్రెస్‌ నాయకులవి బురద రాజకీయాలు : మాజీ మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌ రావు విమర్శించారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌ స్టేషన్లు, 21 పంప్‌ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్‌, 98 కిలోమీటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్‌, 240 టీఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారమని ఆయన తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ వెళ్తుంటే ఎమ్మెల్యేలకు పచ్చని పొలాలను చూపించాల్సిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్‌ నాయకులు ఎంత తక్కువ చేసి మాట్లాడినా అది ముమ్మాటికి తెలంగాణకు వరదాయిని అని తెలిపారు. తెలంగాణ ప్రజలకు జీవ ధార. లోయర్‌ మానేరు నుంచి సూర్యపేట దాకా, నిండిన చెరువులు, పండిన పంటలు, భూమిలో పెరిగిన ఊటలు, మోటారు లేకుండనే ఉబికి వస్తున్న బోర్ల పంపులు ఇవన్నీ కాళేశ్వరం ఫలాలేనని స్పష్టం చేశారు. కూడెల్లి వాగు పొంగిందన్నా, హల్దీ వాగు దుంకిందన్నా, అన్నపూర్ణ రిజర్వాయర్‌ నిండిందన్నా, రంగనాయక్‌ సాగర్‌ నిండిందన్నా, మల్లన్న సాగరం నిండిందన్నా, కొండ పోచమ్మ సాగర్‌ నిండిందన్నా అది కాళేశ్వరం ప్రసాదించిన ఫలితమే అని హరీశ్‌ రావు వివరించారు.
కాళేశ్వరం దుష్ప్రచారం చేయడం వల్ల ఎలాంటి లాభం లేదని హరీశ్‌ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ఫలాల గురించి చెప్పకుండా దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. గతంలో ఇటువంటి సంగతి ఈ దేశంలో ఎన్నడూ జరగని తీరుగా చేస్తున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దయచేసి మేడిగడ్డ పునరుద్దరణ చర్యలు చేపట్టాలని కోరారు. విచారణకు తాము సిద్ధంగా ఉన్నామనీ, ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతిక సమస్య తెలుసుకొని యుద్ధ ప్రాతిపాదికన పనులు చేయాలని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

Spread the love