శ్రీశైలం సొరంగం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

– గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడింది
– గొర్రెల స్కీమ్ పెద్ద స్క్యాం
– యాదవులు కట్టిన డీడీలంతా వాపస్ తీసుకోండి
– రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
శ్రీశైలం సొరంగం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో రూ.50 కోట్లతో నల్లగొండ-కురంపల్లి రోడ్డు విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైలం సొరంగం, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే తన కల నెరవేరుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా జిల్లాలో తాగు, సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించడంతోనే రైతులు ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్,కాలేశ్వరం ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ ప్రభుత్వం మన కడుపు కొట్టిందని ఆరోపించారు. పనికిరాని ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడిందని ధ్వజమెత్తారు. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అభివృద్ధికి నోచుకోలేదని, అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ఆంధ్రాలో రోజా ఇంటికి పోయి చాపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని, జగన్ ఇంటికి వెళ్లి శ్రీశైలం నీటిని ఆంధ్రకు తరలించుకుపోయే విధంగా చేశాడని విమర్శించారు. మూడేళ్లలో శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తి చేయిస్తానని అన్నారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును కూడా పూర్తిచేసి నల్గొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మారుస్తానని పేర్కొన్నారు. తనకున్న రెండు కళ్ళలో నల్గొండ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టులు నాణ్యతగా లేవని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టి తెలంగాణ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయించడంతో పాటు కాలువలకు  లైనింగ్ కూడా వేయిస్తానని మంత్రి స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. గొర్రెల స్కీం పెద్ద స్కామ్ అని మంత్రి ఈ సందర్భంగా అభివర్ణించారు. గొర్రెల స్కీంతో గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారులు బాగుపడ్డారని ఆరోపించారు. యాదవులంతా గొర్రెల కోసం కట్టిన డీడీలంతా వాపస్ తీసుకోవాలని కోరారు. గొర్రెల స్కీమ్ లో జరిగిన అవినీతిపై ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగిందని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పనస శంకర్, సహదేవులు, జెకె. రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love