అంతుచిక్కని జీడీపీ గణంకాలు

అంతుచిక్కని జీడీపీ గణంకాలు– ప్రయివేటు వినిమయం తగ్గింది
– పడిపోయిన ఎఫ్‌డిఐలు
– అయినా 8.4% వృద్థి ఎలా..?
– మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌
న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ ఇటీవల విడుదల చేసిన జీడీపీ గణంకాలపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) అర్వింద్‌ సుబ్రమణియన్‌ విస్మయం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌ 8.4 శాతం వృద్థి నమోదు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ లెక్కలపై శుక్రవారం ఇండియా కాన్‌క్లేవ్‌లో సుబ్రమణియన్‌ మాట్లాడుతూ.. అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. జీడీపి గణంకాలు అంతుచిక్కనివిగా ఉన్నాయన్నారు. ఈ గణాంకాలు తనకు అర్థం కాలేదన్నారు. ప్రధాని మోడీ హయంలో 2014 నుంచి 2018 వరకూ ప్రధాన ఆర్ధిక సలహాదారుగా సుబ్రమణియన్‌ వ్యవహారించారు.
”ఆర్థిక వ్యవస్ధ 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో 8.4 శాతం పెరిగింది. మరోవైపు ప్రయివేటు వినియోగం 3 శాతం మాత్రమే పెరిగింది. కాగా.. తొలి, రెండవ త్రైమాసికాల్లో వృద్థి రేటు 8.2 శాతం, 8.1 శాతంగా చోటు చేసుకుంది. కానీ.. మరోవైపు గత రెండు, మూడు త్రైమాసికాలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) గణనీయంగా తగ్గాయి. భారత్‌ పెట్టుబడుకు అత్యంత ఆకర్షణీయ ప్రదేశమైతే, అధికంగా ఎఫ్‌డిఐలు ఎందుకు రావడం లేదు. కార్పొరేట్‌ పెట్టుబడులు కూడా 2016 స్ధాయిల కంటే దిగువన ఉన్నాయి.” అని అర్వింద్‌ సుబ్రమణియన్‌ అన్నారు. భారతదేశం పెద్ద మార్కెట్‌ అనే వాస్తవం నుండి బయటికి రావాలని పరోక్షంగా మోడీ సర్కార్‌కు సుబ్రమణియన్‌ చురకలు అంటించారు. భారత్‌ పెద్ద మార్కెట్‌ కాదని అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 ఏప్రిల్‌-జనవరిలో కీలక రంగాల వద్ధిరేటు 7.7 శాతానికి తగ్గింది. గడిచిన 2022-23 ఇదే వ్యవధిలో 8.3 శాతంగా చోటు చేసుకుంది. ఏడాదికేడాదితో పోల్చినప్పుడు తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌లో ఎఫ్‌డిఐల్లో ఏకంగా 13 శాతం పతనమై 32.03 బిలియన్‌ డాలర్లకే పరిమితమయ్యాయి. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ట్రేడింగ్‌, సేవలు, టెలికం, ఆటో, ఔషధ, రసాయన రంగాల్లో ఎఫ్‌డిఐలు దిగజారినట్టు తేలింది. ఈ నేపథ్యంలో జిడిపి అమాంతం వృద్థి చెందడం ప్రభుత్వ తప్పుడు లెక్కలకు నిదర్శనమనే విమర్శలు పెరిగాయి.

Spread the love