– వర్షాల్లేక ఎండుతున్న పంటలు
– కరువు ప్రభావంతో తగ్గిన వ్యవసాయ పనులు
– మండుటెండల్లో మగ్గుతున్న కూలీలు
– నీళ్లు, నీడ, మెడికల్ కిట్స్ కరువు
– వేసవి అలవెన్స్ తీసేసిన కేంద్రం
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జలాశయాల్లో నీటి లభ్యత తగ్గడం.. భూగర్భ జలాలు అడుగంటడం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యాసంగి పంటల సాగు తగ్గడమే కాకుండా నీటి ఎద్దడి వల్ల వేసిన పైర్లూ ఎండిపోయాయి. దాంతో గ్రామీణ పేదలకు వ్యవసాయ పనుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పనుల వైపు మొగ్గుతూ మండుటెండల్లో మగ్గుతూ పనిచేస్తున్నారు. కరువు వల్ల ఈజీఎస్ పనులకు కూలీల సంఖ్య పెరుగుతోంది. కూలీలకు కనీసం నీడ, నీళ్లు, ప్రథమ చిక్సిత కోసం మెడికల్ కిట్స్ కూడా లేవు. 30 నుంచి 40 శాతం అదనంగా ఇచ్చే వేసవి అలవెన్స్‌ను కేంద్రం రద్దు చేసింది.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రతి ఇంటికీ ఏడాదిలో కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనం అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంపొందించడం లక్ష్యంగా తెచ్చిన ఈజీఎస్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వచ్చింది. వ్యవసాయ పనుల్లేని పరిస్థితుల్లో ఈజీఎస్ పనులే ఆధారంగా మారుతున్నాయి. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆశించిన రీతిలో పంటలు లేవు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు పనుల్లేకపోయే సరికి ఉపాధి పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో 2.3 లక్షల మంది కూలీలు పనులకు వస్తున్నారు. మెదక్ జిల్లాలో 2.24 లక్షల మంది కూలీలు ఈజీఎస్ పనులు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 2.38 లక్షల మంది కూలీలు పనులకు వెళుతున్నారు.ఉపాధి పనులకు గతం కంటే 15 శాతం మంది కూలీలు అదనంగా వెళ్తున్నారు.
కరువు వల్ల దెబ్బతిన్న వ్యవసాయ పనులు
రాష్ట్రంలో కరువు చాయలు నెలకొన్న జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా కూడా ఉంది. జలాశయాల్లో నీటి లభ్యత తగ్గడం వల్ల యాసంగి సీజన్‌లో మూడు జిల్లాల్లో కలిపి 2.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. నీటి ఎద్దడి వల్ల వరి, ఇతర మెట్ట పైర్లు ఎండిపోయాయి. అకాల వర్షాల వల్ల కూడా పంటలు దెబ్బతిన్నాయి. దాంతో వ్యవసాయ పనుల్లేకుండా పోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పండించే వరితో పాటు ఉల్లి, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, ఆలు, మినుము వంటి పంటలు దెబ్బతినడం వల్ల కూలీలకు పనులు దొరకట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో సిద్దిపేట జిల్లాలో 8.65 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలుండగా ప్రస్తుత ఫిబ్రవరి చివరి నాటికి 11.07 మీటర్లకు పడిపోయింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ గతేడాది కంటే ప్రస్తుత నీటి మట్టం 2 మీటర్ల వరకు పడిపోవడంతో కరువు నెలకొంది. కూలీలు, సన్నకారు రైతులు ఉపాధి పనులు కల్పించాలని కోరుతున్నారు.
గిట్టని కూలి.. పెరగని పని దినాలు
ఉపాధి హామీలో రోజంతా కష్టపడి పనిచేసినా కూలి గిట్టట్లేదు. కనీసం పని దినాలు పెంచే పరిస్థితిలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఉపాధి హామీ కింద పనులకు కూలీల సంఖ్య పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న కూలీలకు రోజు కూలి రూ.180, సిద్దిపేట జిల్లాలో రూ.191, మెదక్ జిల్లాలో రూ.175 చొప్పున చెల్లిస్తున్నారు. ఈజీఎస్ చట్టం ప్రకారం పెంచిన రోజు వారి కూలి రూ.271 ఇవ్వాలి. కొరతల పేరిట కూలీలు చేసిన పనిని లెక్కించి కోతలు పెట్టి సగటు కూలి రూ.180కి మించి ఇవ్వట్లేదు. గట్టిపడిన మట్టిని తవ్వే పనులు కష్టంగా మారాయని కూలీలు ఆవేదన చెందుతున్నారు.
వేసవి అలవెన్స్ రద్దు చేసిన కేంద్రం
ఉపాధి హామీ చట్టం కింద పనిచేసే కూలీలకు ఎండాకాలంలో అదనపు అలవెన్స్‌లు చెల్లించాలి. ఎండల తీవ్రతను బట్టి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 30 నుంచి 40 శాతం వేసవి అలవెన్స్ చెల్లించాలి. కూలీలకు అది కాస్త ఉపసమనంగా ఉండేది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్‌లో ఇచ్చే వేసవి అలవెన్స్‌లను రద్దు చేసింది. ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఇచ్చే వేసవి అలవెన్స్‌లను కూడా కేంద్రం రద్దు చేయడమేంటని కూలీలు ప్రశ్నిస్తున్నారు.
మండుటెండల్లో మగ్గుతున్నం
మండుటెండల్లో మగ్గు తన్నం. మట్టితవ్వకం పని కష్టంగా ఉంది. గుణపం పట్టి పనిచేస్తుంటే చేతులు బొగ్గలొచ్చి అల్లాడుతున్నం. మేమెంత పని చేసినా కొలతలంటూ రోజు కూలి రూ.180కి మించట్లేదు. మా కష్టానికి రూ.600 కూలి ఇవ్వాలి. ఎండా కాలంలో అదనంగా 35 శాతం అలవెన్స్ ఇచ్చేది.. దాన్నీ బంద్ చేసిండ్రు. ఎండకు మాడిపోతున్నం. నీడ, తాగే నీళ్లు పెట్టట్లేదు. దెబ్బతగిలినా వడదెబ్బకు గురైనా చికిత్స కోసం ముందులిచ్చేది.. అవీ ఇవ్వట్లేదు.
– రాములు, ఉపాధి కూలి
రూ.600 వేతనమివ్వాలి
ఉపాధి కూలీలకు రూ.600 వేతనమివ్వాలి. వంద రోజుల పని కల్పించాలి. నీళ్లు, నీడతోపాటు మెడికల్ కిట్స్ పని ప్రదేశాల్లో ఉంచాలి. వ్యవసాయ పనుల్లేక కూలీల సంఖ్య పెరిగింది. సరిపడా పని దినాలు కల్పించాలి. వారం వారం కూలీలకు వేతన బిల్లులు చెల్లించాలి. జీయో ట్యాంగింగ్ పద్ధతి తీసేయాలి.
– నర్సింహులు, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు