ఫీజు బకాయిలను విడుదల చేయాలి

ఫీజు బకాయిలను విడుదల చేయాలి–  సీఎం రేవంత్‌రెడ్డికి టీపీడీఎంఏ అధ్యక్షులు సూర్యనారాయణరెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రయివేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రయివేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీడీఎంఏ) అధ్యక్షులు డాక్టర్‌ బి సూర్యనారాయణరెడ్డి ప్రభు త్వాన్ని కోరారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో ఆయన కలిశారు. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో ప్రయివేటు జూనియర్‌, డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ కాలేజీల్లో 14 మంది విద్యార్థులు చదువుతున్నారనీ, వారికి చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏడాదికి సుమారు రూ.700 కోట్లవుతుందని వివరించారు.2014కు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం డిసెంబర్‌ 31లోపు పాత విద్యార్థులకు (రెన్యూవల్స్‌), మార్చి 31లోపు కొత్త విద్యార్థుల (ఫ్రెష్‌)కు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.వృత్తి విద్యా కాల ేజీలు యాజమాన్య కోటా, ఇతర ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేస్తాయని తెలిపారు. కానీ డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాలకు ఎలాంటి ఫీజులను వసూలు చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఫీజు బకాయిలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న టోకెన్ల డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

Spread the love