అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా

 – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో పదేండ్లలో జరిగిన అభివృద్ధిపైనా, గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపైనా చర్చించేందుకు సిద్ధమేనా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే వచ్చినా, రాహుల్‌గాంధీ వచ్చినా చర్చించేందుకు కేంద్రమంత్రిగా తాను రెడీగా ఉన్నానని చెప్పారు. వికసిత్‌ భారత్‌ పేరుతో ప్రధాని మోడీ విడుదల చేసిన సంకల్ప పత్రం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఐదేండ్లలో పేదలు, మహిళలు, యువకులు, రైతులపై వచ్చే ఐదేండ్లలో దృష్టి పెట్టి పనిచేస్తామన్నారు. మరో ఐదేండ్ల పాటు ప్రజలకు ఉచిత రేషన్‌ బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. తెల్లరేషన్‌కార్డు లేని మధ్యతరగతి వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద వైద్యం అందిస్తామని చెప్పారు. రాబోయే ఐదేండ్లలో 3 కోట్ల ఇండ్లను పేదలకు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా జనగణన పూర్తయిన తర్వాత మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. పోస్టాఫీసులను సోషల్‌ సెక్యూరిటీ కేంద్రాలుగా ఉపయోగించాలనీ, వాటిని గ్రామీణ బ్యాంకులుగా అభివృద్ధిచేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విదేశాల్లో మాదిరిగానే మనదేశంలోనూ వన్‌ నేషన్‌..వన్‌ ఎలక్షన్‌ అవసరముందన్నారు. అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్‌ రద్దును ఎత్తేస్తామనీ, ట్రిపుల్‌ తలాఖ్‌ను అమలు చేస్తామని చెప్పడానికి సిగ్గుండాలని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువులు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించడం, దళిత సీఎం, కేజీటూ పీజీ విద్య, తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు చెక్‌ బౌన్సులు, ఐటీ ఎగ్గొట్టడం, బ్యాంకులను మోసం చేసే అలవాటు ఉందని చెప్పారు.

Spread the love