మారిన ప్రచార తీరు.?

– కనిపించని ఆర్భాటాలు
– సోషల్ మీడియాపై భారీ ఆశలు
-జనాలు ఎక్కడుంటే అక్కడికే అభ్యర్థులు నాయకులు 
నవతెలంగాణ – చండూరు  
ఎన్నికలు అనగానే క్షేత్రస్థాయిలో నాయకులు,కార్యకర్తలు అన్ని తామై వ్యవహరించేవారు.పొద్దుపొడిచింది మొదలు అర్ధరాత్రి వరకు ప్రచార హడావిడిలో మునిగితేలేవారు.ప్రచారానికి వచ్చిన అభ్యర్థికి ఘనస్వాగతం పలుకుతూ భారీ జనాన్ని సమికరించేవారు.ఇదంతా ఒకప్పటి పరిస్థితి.ప్రస్తుతం ఎన్నికల ప్రచార తీరు మారింది.జనాన్ని సమికరించే పరిస్థితి లేకపోవడంతో జనాలు ఉన్నదగ్గరకె అభ్యర్థులు నాయకులు,కార్యకర్తలు వెళుతున్నారు.ర్యాలీలు,ఇంటింటా ప్రచారం అంతగా కనిపించడం లేదు.టెక్నాలజీ ప్రతి ఒక్కరికి దగ్గరైన నేపథ్యంలో సోషల్ మీడియాలలో ప్రచారం భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు.
ఉపాధిహామీ కూలీలతో కార్నర్ మీటింగ్ లు..
ఒకప్పుడు ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలు పార్టీల జెండాలను కట్టి,పోస్టర్లను అతికించేవారు. నెత్తిన టోపి పెట్టుకొని,చేతిలో జెండాను పట్టుకొని  పార్టీలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించేవారు.పార్టీల నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించేవారు.ఇప్పుడు ట్రెండ్ మారింది.ప్రధాన పార్టీల నాయకులు మార్నింగ్ వాకర్స్ తో కులాల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ కూలీలను కలిసి ఓటు వేయాలని కార్నర్ మీటింగ్ లు పెడుతున్నారు.ఇంటింటా ప్రచారాన్ని స్థానిక నాయకులకు అప్పగిస్తున్నారు.
పాటల ద్వారా ప్రచారం..
ప్రధాన పార్టీల అభ్యర్థులు పాటల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు.ఈ పాటలలో పార్టీ అభ్యర్థి,ఏపార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ గెలిస్తే చేసే పనులు,అభ్యర్థి,పార్టీ గొప్పతనం గురించి వివరిస్తూ పాటలను ప్రజలలోకి తీసుకెళుతున్నారు.గ్రామాల్లో కళాజాత బృందాలతో ప్రచారం చేస్తూ,పార్టీలకు సంబంధించిన ప్రసంగంతోపాటు పార్టీల మేనిపేస్టో ను వివరిస్తూ ఓట్లను అడుగుతున్నారు.
హంగు,ఆర్భాటాలు లేకుండా ..
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండగా గ్రామ,మండల,పట్టణాల్లో హంగు ఆర్భాటాలు కానరావడం లేదు.ఎండ తీవ్రతకు నాయకులు కాలు తీసి బయట పెట్టడానికి జంకుతున్నారు.గ్రామాల్లో ఉదయం పూట టిస్టాల్ ,వ్యవసాయ,ఉపాధిహామీ కూలీ పనుల వద్ద ఎన్నికలపై చర్చించుకుంటున్నారు.కానీ ఎక్కడా పార్టీల ఆర్భాటాలు,ప్రచారాలు కనిపించడం లేదు.
Spread the love