ఎమ్మెల్సీ ఎన్నికకు తగిన ఏర్పాట్లు చేయాలి: రిటర్నింగ్ అధికారి హరిచందన దాసరి

– 22న నల్గొండ,సూర్యాపేట జిల్లాల పోలింగ్ సిబ్బందికి  శిక్షణ కార్యక్రమాలు
– 24న పిఓ,ఏపిఓ, సూక్ష్మపరిశీలకులకు  2 వ విడత శిక్షణ
– ఓట్ల లెక్కింపు 5 వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్, కౌంటింగ్ లకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి  పట్టభద్రుల ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నోడల్ అధికారులతో  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 22న  నల్గొండ,సూర్యాపేట జిల్లాల పోలింగ్ సిబ్బందికి కౌంటింగ్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, ఇదేవిధంగా అవసరమైతే అన్ని 12  జిల్లాల్లో సైతం శిక్షణ నిర్వహించేలా చూడాలని కోరారు. 24వ తేదీన పిఓ,ఏపిఓ, సూక్ష్మపరిశీలకులకు  2 వ విడత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, రెండో విడత  రాండమైజేషన్  సైతం అదే రోజు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 5 వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని,  ఓట్ల లెక్కింపులో హాజరయ్యే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.
బ్యాలెట్ బాక్స్ లను సంసిద్ధం చేయడం, బ్యాలెట్ పేపర్, పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి సిద్దం వంటి వాటిని సిద్ధం చేసుకోవాలని, అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ చికిత్స సౌకర్యాలతో పాటు, దివ్యంగ ఓటర్లకు వాహనాలు ఏర్పాటు చేయాలని, వీల్ చైర్లు పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఈనెల 20 నుండి 25 వరకు నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని  ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులు, పోలీసులు, సూక్ష్మ పరిశీలకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. పట్టభద్రుల శాసనమండలి  ఉప ఎన్నిక పై ఓటర్లకు తగిన అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. పట్టబద్రుల శాసన మండల ఉప ఎన్నిక  ప్రణాళిక, అభ్యర్థుల  వ్యయనిర్వహణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో రెవిన్యూ ఆధనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, నల్గొండ ఆర్డీవో రవి,  జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Spread the love