ఎం.ఎల్.సీ. ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

– వాహనాల్లో సామగ్రితో  కేంద్రాలకు వెళ్లిన సిబ్బంది
– అన్ని కేంద్రాల్లో పటిష్ఠ భద్రత
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కు సర్వం సిద్ధమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. ఆదివారం  కలెక్టరేట్ లో  పట్టభద్రుల ఉప ఎన్నిక  డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్.పి. రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు సి.హెచ్.ప్రియాంక, బి.ఎస్. లత, అదనపు ఎస్.పి నాగేశ్వర రావు లతో కలసి   ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని అలాగే డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో 16 సెక్టార్ అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన 71 టేబుల్స్ ద్వారా పోలింగ్ బాక్స్ లు, ఎన్నికల సామగ్రి   ఎన్నికల సిబ్బందికి అందించడం జరిగిందని తెలిపారు. అదేవిదంగా 71 కేంద్రాల్లో నిరంతరం వెబ్ కాస్టింగ్ అలాగే 19 క్రిటికల్ కేంద్రాల్లో బయట కూడా వెబ్ కాస్టింగ్ చేపట్టామని అన్నారు. సూర్యాపేట డివిజన్ లోని 31 కేంద్రాల్లో మహిళ ఓటర్లు 17081, పురుష ఓటర్లు 9071, కోదాడ డివిజన్ లోని  22 కేంద్రాల్లో  మహిళ  ఓటర్లు 8120, పురుష ఓటర్లు 4065, హుజూర్ నగర్ డివిజన్ లోని 18  కేంద్రాల్లో 8975, పురుష ఓటర్లు 4185 మొత్తం 51497 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.
ముందుగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు కలెక్టరేట్ లో  ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు.  29 ప్రాంతాల్లో 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 16 మంది తహశీల్దార్లను సెక్టార్ అధికారులుగా నియమించామని అలాగే 340 మంది సిబ్బందిని ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించామని తెలిపారు. పోలీసు బందోబస్తు నడుమ రూట్ల వారీగా వాహనాల్లో ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు పంపించడం జరిగిందని అన్నారు. మూడు డివిజన్లలో 22 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది ఓటర్లు ఉన్నచోట జెంబో పోలింగ్ బాక్సులు, అలాగే మిగతా చోట పెద్ద పోలింగ్ బాక్సులు వినియోగిస్తున్నామని తెలిపారు.అంతకు ముందు  కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులు, పి.ఓ, ఏ.పి.ఓ లకు ఎన్నికల విధివిధానాల పై పలు సూచనలు, సలహాలు అందచేసి ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, సిబ్బంది అందరూ సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్.పి. సి.ఈ. ఓ అప్పారావు, ఆర్.డి.ఓ వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాస్, ఎల్.డి.ఎం. బాపూజీ, తహశీల్దార్లు, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love