రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వానలు

– ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం!
– భద్రాచలంలో 7.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల పాటు వానలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొన్నారు. టీఎస్‌డీపీఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో అత్యధికంగా 7.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 140 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. 62 ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. శనివారం రాష్ట్రంలో నిజామాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే సూచనలున్నాయి. 16న పై జిల్లాలతో పాటు రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాలో వర్షం పడే అవకాశాలున్నాయి.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
భద్రాచలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) 7.25 సెంటీమీటర్లు
సముద్రాల (సిద్దిపేట జిల్లా) 7.10 సెంటీమీటర్లు
చిమ్మన్‌పల్లి (నిజామాబాద్‌ జిల్లా) 6.45 సెంటీమీటర్లు
మల్కాపూర్‌ (జనగాం జిల్లా) 6.38 సెంటీమీటర్లు
ఫణిగిరి (సూర్యాపేట జిల్లా) 5.58 సెంటీమీటర్లు

Spread the love