సింగరేణి ఉత్తర తెలంగాణ గుండెకాయ

– టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటిదని టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1973లో ఇందిరా గాంధీ బొగ్గు తవ్వకాలను జాతీయం చేశారని చెప్పారు. విపరీతమైన దోపిడీ, పర్యావరణ విధ్వంసం జరుగుతుందని గ్రహించి ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ప్రయివేటీకరణ వల్ల విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయనీ, దాన్ని నియంత్రించేందుకు వేలం పద్ధతిని అమలు చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అయితే కచ్చితంగా వేలం వేయాలని ఆ న్యాయస్థానం చెప్పలేదన్నారు. సింగరేణి ఎంతో సమర్థవంతంగా బొగ్గు తవ్వకాలు చేస్తోందని వివరించారు. సుమారు రూ. 7 వేల కోట్ల వరకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. వేలం వేయడం కంటే సింగరేణి ద్వారానే ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్పారు. సింగరేణి పరిధిలో ప్రజలు ఆర్థికంగా ఎదిగారనీ, అది సామాజికమార్పుకు కారణమయ్యిందని చెప్పారు. అందువల్ల వేలం నుంచి సింగరేణికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గనులు సింగరేణికి ఇవ్వకపోతే పదేండ్లలో ఆ సంస్థ తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love