– ఏఐఎస్‌ఎఫ్ ఓయూ కౌన్సిల్
నవతెలంగాణ-ఓయూ
గ్రూప్ 2, 3 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని ఏఐఎస్‌ఎఫ్ ఓయూ కౌన్సిల్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఓయూ ప్రధాన లైబ్రరీ దగ్గర మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, ఓయూ అధ్యక్షులు లెనిన్, కార్యదర్శి నెల్లి సత్య మాట్లాడుతూ. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో గ్రూప్-2 గ్రూప్ -3, పోస్టులు పెంచుతామని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ని నిర్వహిస్తామని , ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేసి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు నియమిస్తామని, జీవో నెంబర్ 46 జీవో నెంబర్ 317కు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచకుండా, డీఎస్సీ పోస్టులు కేవలం 11 వేలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి మోసం చేశారన్నారు. వెంటనే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక వేదికల పైన నిరుద్యోగ విద్యార్థులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పదేపదే చెప్తున్నారు కానీ వారి సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదని విమర్శించారు. ఇప్పటికైనా నిరుద్యోగుల సమస్యల పరిష్కరించడంలో చొరవ చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి ఎగ్జామ్ లను నిర్వహించాలని,25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలని, జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 317 ల సమస్యపై శాశ్వత పరిష్కారం చూపాలని,గురుకుల పోస్టుల నియామకాలలో రిల్‌ఇంక్విస్మెమెంట్ విధానం అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ప్రభుత్వ ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేసి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను సమీకరించి దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి, భగత్, నాయకులు రమేష్, మధు పాల్గొన్నారు.