మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 30న తెలంగాణ మాల జర్నలిస్ట్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చందా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహాదేవ్,గౌరవ అధ్యక్షులు బొడ్డు అశోక్ తో కలిసి ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు కనీసం ఇల్లు లేని వారు ఎందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నూతన ప్రభుత్వ హయాంలోనైనా ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ నేటికీ జర్నలిస్టులకు 100% రాయితీతో ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వలేదని తక్షణమే ఇవ్వాలని కోరారు. అనేక సమస్యల సాధనకై జిల్లా కేంద్రంలో నిర్వహించే వార్షికోత్సవ సభకు జిల్లా మాల జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న వివిధ జర్నలిస్ట్ సంఘాల నేతలు ఆయా జిల్లాల నుండి మాల జర్నలిస్ట్ లు పాల్గొంటారని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బండ రాజ్ కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శులు చదల యాకాంతం, కొప్పుల శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.