– ఇద్దరు భద్రతా సిబ్బంది..
– ఆరుగురు ఉగ్రవాదులు మృతి
– రాజౌరిలో జవాన్‌కు గాయాలు
జమ్ము: జమ్ముకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. అలాగే రాజౌరిలో జరిగిన ఉగ్రదాడిలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగుర్ని చంపడం ఉగ్రవాదుల ఏరివేతలో ప్రధానమైన ముందడుగుగా జమ్ముకాశ్మీర్ డిజిపి ఆర్‌ఆర్ స్వైన్ పేర్కొన్నారు.. కుల్గాంలోని చినిగాం, మోటర్‌గామ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో శనివారం నుంచి . పోలీసులు, సైన్యం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయని అన్నారు. తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో సిబ్బంది కూడా ఎదురు కాల్పులు జరిపారని డిజిపి తెలిపారు. చినిగాంలో ఒకరు, మోటర్‌గామ్‌లో ఒకరు మొత్తం ఇద్దరు సైనికులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందినట్లు చెప్పారు. చనిపోయిన జవాన్లను లాన్స్ నాయక్ పర్దీప్ కుమార్, సిపాయి ప్రవీణ్ జంజల్ ప్రభాకర్‌గా గుర్తించారు. రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు.