– పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసిన వాతావరణశాఖ.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవడంతో పాటు సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో చిరుజల్లులు కురిసే సూచనలున్నాయి. రాష్ట్రం మీదుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.