– కచ్చితమైన నీట్ స్కోర్‌లపై ఎన్‌టీఏ వెల్లడి
న్యూఢిల్లీ: సిలబస్‌లో గణనీయమైన తగ్గింపు కారణంగా అండర్ గ్రాడ్యుయేట్ నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్(నీట్-యూజీ) 2024లో 61 మంది విద్యార్థులు కచ్చితమైన 720/720 స్కోర్‌లను సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సుప్రీంకోర్టుకు వివరించింది. ”61 మంది అభ్యర్థులు కచ్చితమైన స్కోర్ చేయటంలో అత్యంత ప్రముఖమైన అంశం.. సిలబస్‌లో తగ్గింపు. ఇది అభ్యర్థులు కోర్ కాన్సెప్ట్‌లపై దృష్టి పెట్టటానికి, మహమ్మారి కారణంగా చదువును పూర్తి చేయటంలో సవాళ్లను ఎదుర్కొన్న విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడింది” అని ఎన్‌టీఏ వివరించింది. 2023లో హాజరైన అభ్యర్థుల సంఖ్య 20,38,596 కాగా, 2024లో హాజరైన అభ్యర్థుల సంఖ్య 23,33,297కి పెరిగిందని వివరించింది. విద్యార్థుల పట్ల ఉన్న ఆందోళనకు వ్యక్తీకరణగా గత సంవత్సరంతో పోలిస్తే 2024లో సిలబస్‌ను తగ్గించినట్టు పరీక్షా ఏజెన్సీ తెలిపింది. ”సిలబస్ గత సంవత్సరంతో పోల్చితే సుమారు 22 శాతం నుంచి 25 శాతం తగ్గించబడింది. తగ్గింపు విద్యార్థులపై అధ్యయనాల భారాన్ని గణనీయంగా తగ్గించింది. సిలబస్, సమర్థవంతంగా, సమగ్రంగా పరీక్షకు సిద్ధం చేయటంలో అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చింది. అంతేకాకుండా, 2024లో అధిక శాతం పెరగడానికి మరొక కారణం ఏమిటంటే, ప్రశ్నపత్రాలు సార్వత్రికంగా ఉపయోగించే మరియు దేశవ్యాప్తంగా విద్యార్థులకు అందుబాటులో ఉండే పుస్తకాలపై ఆధారపడి ఉంటాయి. అందరూ అభ్యర్థులు, వారి భౌగోళిక లేదా సామాజిక-ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా విజయం సాధించడానికి సమాన అవకాశం కల్పించేలా ఈ వ్యూహం అమలు చేయబడింది” అని ఎన్‌టీఏ వివరించింది. కోచింగ్ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించటమే ప్రధాన లక్ష్యాలలో ఒకటి అని పేర్కొన్నది. ” ఈ కారణంతో నీట్ 2024లోని ప్రశ్నపత్రాలు సమతుల్యంగా ఉన్నాయని వివరించింది. నిర్దిష్ట ఎంపిక పరీక్షా కేంద్రాల నుంచి విద్యార్థులు అధిక మార్కులు స్కోర్ చేశారనే ఆరోపణలను పూర్తిగా నిరాధారమైనదని ఎన్‌టీఏ కొట్టిపారేసింది.