ప్రైమరీ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి : డీటీఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలకూ ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి ఎస్జీటీలందరికీ ప్రమోషన్లకు అవకాశమిచ్చి భర్తీ చేయాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని డిక్కీహౌస్‌లో ఆ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి డీఈడీ, బీఈడీ అర్హతలు గల సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు అందరికీ ప్రమోషన్‌ కు అవకాశం కల్పించాలనీ, ఇటీవల జరిగిన పదోన్నతుల్లో మిగిలి పోయిన పోస్టులకు వెంటనే ప్రమోషన్‌ కౌన్సిలింగ్‌ చేపట్టాలని వారు కోరారు. గతంలో మాదిరిగా ప్రతినెలా ప్రమోషన్లు ఇవ్వాలని విన్నవించారు. నాలుగు డీఏ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి పాఠశాలకూ స్వచ్ఛ కార్మికులను నియమించాలనీ, పాఠశాలల కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. విద్యార్థులకు సరిపడ స్కూల్‌డ్రెస్సులు, పాఠ్య పుస్తకాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అధ్యాపకజ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్‌ ఎం.గంగాధర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శాంతన్‌, వి.రాజిరెడ్డి, వి.రేణుక, టి.శ్రీశైలం, చాపబాబు, రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌.భాస్కర్‌, జె.రామస్వామి, ఎ. శ్రీనివాసరెడ్డి, బి.శ్యామ్‌, అకడమిక్‌ సెల్‌ కన్వీనర్‌ డా.బి. రామకృష్ణ, అధ్యాపక జ్వాల సంపాదకులు జి. కళావతి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ పి.ఈశ్వర్‌ రెడ్డి, సభ్యులు బి.సదానందం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love