లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల ధర్నా..

– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
అలీ సాగర్, గుత్ప లిఫ్టి ఇరిగేషన్ లో పనిచేసే కార్మికులకు గత నాలుగు నెలల నుండి వేతనాలు రాకపోవడంతో నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట లో గల ఇరిగేషన్  ఎస్.ఈ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి, ఎస్ ఈ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ కార్మికులకు నెలనెలా వేతనాలు చెల్లించకుండా మూడు, నాలుగు నెలల పాటు బకాయిలు పెడుతూ కార్మికులతో తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. సకాలంలో నెలనెలా వేతనాలు చెల్లించకపోవడం మూలంగా నిరంత పనిచేసిన కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని అన్నారు. బాధ్యతారహితమని ఇరిగేషన్ అధికారులు కూడా కార్మికుల విత్తనాల చెల్లింపు పై పట్టించుకోకపోవడం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటం సరైనది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల అయినంత మాత్రాన వారి బాధ్యత తమది కాదన్నట్టుగా వివరించటం అధికారులు తప్పించుకోవటమే అవుతుందని తెలిపారు. వేతనాల గురించి కాంట్రాక్టర్ను అడిగితే సంవత్సరంకు పైగా తమకు బిల్లులు రాలేదని, అందువలన వేతనాలు చెల్లించటం లేదని, కాంట్రాక్టర్ బిల్లులకి వేతనాలకి పొంతన పెట్టటం సరైనది కాదని అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన వేతన బకాయిలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ అందేవిధంగా చూడాలని అన్నారు. కాంట్రాక్టర్ తో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వ కాలపరిమితి ముగిసినప్పటికీ కొత్తగా టెండర్లు పిలవకపోవడం మూలంగా కార్మికులకు వేతనాలు పెరగటం లేదని  అన్నారు. అందువల్ల వెంటనే కొత్తగా టెండర్లను పిలిచి, కార్మికుల వేతనాలు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని లేనియెడల కార్మికులు సమ్మెకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల నాయకులు గణేష్, మైపాల్, కార్తీక్, బుచ్చన్న, సందీప్, ప్రవీణ్, అజయ్, నరేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. అనంతరం లేబర్ అధికారులకు కూడా వినతిపత్రాన్ని అందజేశారు.
Spread the love