నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లలో ఉన్నతాధికారుల నుండి వచ్చిన లిస్టులను టాంపరింగ్ చేసి అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ పై వెంటనే విచారణ జరిపించి తగు చర్యలు చేపట్టాలని డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డిలు డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల ప్రమోషన్ల సీనియారిటీ లిస్టులలో అనేక తప్పుడు విధానాలు పాటించడం,ప్రమోషన్ల కోసం వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుండి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు, పొస్టింగ్ లు ఇస్తూ నిజామాబాద్ జిల్లాకు పంపించిన లిస్టును నిజామాబాద్ డీఈవో తారుమారు చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడటం జరిగింది.సీనియర్ ను కాదని,జూనియర్ కు ప్రమోషన్ ఇవ్వడం,వెబ్ ఆప్షన్ కి భిన్నంగా పాఠశాలలు కేటాయింపు, ఉన్నతాధికారులు లిస్టును ఇష్టానుసారంగా మార్చడం వంటి అనేక అక్రమాలకు పాల్పడటం జరిగింది.ఈ విషయమై డిటిఎఫ్ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేని కారణంగానే డిటిఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అట్టి డీఈవో పై విచారణ జరిపించి తగు చర్యలు చేపట్టాలని జులై 1వ తేదీనే విద్యాశాఖ డైరెక్టర్ కి ప్రాతినిధ్యం చేసామన్నారు. కానీ ఇప్పటివరకు నిజామాబాద్ డీఈవో పై ఎలాంటి విచారణ గాని,చర్యలు గాని చేపట్టడం జరగలేదన్నారు. కావున నిజామాబాద్ డీఈవో తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే, సి సి ఏ నిబంధనలకు విరుద్ధంగా డిటిఎఫ్ బాధ్యులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బహిరంగ పత్రికా ప్రకటన చేయడం జరిగిందన్నారు. కావున ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిజామాబాద్ డీఈవో అక్రమాలపై విచారణ జరిపించి తగు చర్యలు చేపట్టాలని, డిటిఎఫ్ బాధ్యులపై పోలిస్ స్టేషన్ లో పెట్టిన తప్పుడు కేసు ఉపసంహరణకై కూడా చర్యలు చేపట్టాలని కోరారు.