– రైతు వేదికల వద్ద ఏవోను సంప్రదించండి : మంత్రి తుమ్మల విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తమకు రుణమాఫీ కాలేదనే ఆందోళన చెందొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విజ్ఞప్తి చేశారు. సాంకేతిక సమస్యలుంటే రైతువేదికల వద్ద ఏవోలను సంప్రదించాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రూ.31వేలకోట్ల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమన్నారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఆత్రుతతో రైతులను ప్రక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మీడియాలో పుంఖానూ,పుంఖాలుగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజ నిజాలను తెలుసుకుని ప్రసారాలు చేయాలనీ, వార్తలు రాయాలని కోరారు. రైతులను ఆగం చేయడం, అయోమయానికి గురి చేయడం తగదన్నారు. రుణమాఫీకి అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం కానివ్వబోమని చెప్పారు. గత ప్రభుత్వం రైతు బంధు చెల్లించకుండా ఉంటే తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. మార్గదర్శకాలను ఖరారు చేసిన తర్వాత రైతు భరోసా ఇస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మోసం వల్ల తమపై అపనమ్మకం పెట్టుకోవద్దని మంత్రి కోరారు.