– తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు శనివారం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.గోవింద్ హరి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బందికి ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా నగదు రహిత సేవలకు చెల్లింపులు ఆలస్యమవుతున్నందున శనివారం నుంచి ఈ సేవలను నిలిపివేస్తామని అసోసియేషన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అసోసియేషన్ నాయకులతో చర్చించారు. బకాయిల చెల్లింపులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఈ సేవలకు క్రమం తప్పకుండా నెలవారీగా చెల్లింపులు జరిగేలా కృషి చేస్తామని వెల్లడించారు. మంత్రి హామీ మేరకు, దీంతో సేవల నిలుపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు అసోసియేషన్ స్పష్టం చేసింది.