జ్యోతిభాపూలే గురుకుల ప్రిన్సిపల్ బెదిరింపులపై విద్యార్థినుల బెంబేలు       

Jyotibhapule Gurukula principal's threats of female students– సుంకె విజిట్ తో  వెలుగులోకి వచ్చిన సమస్యలు
– పురుగుల అన్నం..అరకొర వసతులు
– ప్రభుత్వం, ప్రిన్సిపల్ తీరుపై సుంకె ఆగ్రహం
నవతెలంగాణ – గంగాధర 
గంగాధర చౌరస్తాలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తీరుపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురుకులంను సందర్శించగా, ప్రిన్సిపల్ వ్యవహరిస్తున్న తీరు బట్టబయలైంది. ప్రతి రోజు  పురుగుల అన్నం.. అరకొర వసతులతో అనేక అవస్థలు పడుతున్నామని, ఇదేంటని ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ బెదిరింపులకు   గురి చేస్తుందని విద్యార్థినులు ఆరోపించారు. గురుకులంలో కనీస సౌకర్యాలు, నాణ్యమైన భోజనం కల్పించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని వాపోయారు. ప్రభుత్వం గురుకులాలను పట్టించుకున్న పాపానపోవడంలేదని, నాణ్యమైన భోజనం పెట్టడంలేదని అడిగితే  ప్రిన్సిపల్ బెదిరింపులకు గురి చేయడం మానుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. ఆదివారం గురుకులంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, స్థానిక ప్రజాప్రతినిధుల ఎదుట విద్యార్థినులు సమస్యలు చెప్పుకుని ఆవేదన చెందారు. గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ తమ ఇబ్బందులను పట్టించుకోవడంలేదని భోజనం సక్రమంగా లేకపోగా, సరిపడ మరుగుదొడ్లు లేవన్నారు.
ఫ్యాన్లు, త్రాగునీరు వంటి పలు సమస్యలు ఉన్నాయని, అవి అడిగితే ప్రిన్సిపల్ పాఠశాల నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. తెల్లవారుజామున రెండు గంటల నుండి స్నానాలు చేసేందుకు లైనులో ఉంటున్న సరిపడ బాత్ రూంలు లేక ఒక్కోసారి సమయం సరిపోక స్నానాలు చేయకుండానే క్లాస్ రూములోకి వెళ్లాల్సి వస్తుందని విద్యార్థినులు వాపోయారు. గురుకులంలో 600 మంది విద్యార్థినులం ఉన్నమని, సరిపడా మరుగుదొడ్లు, స్నానాల గదులు లేకపోవడం తో రోజు చాలా ఇబ్బందులు పడుతున్నామని తమ ఆవేదన చెందారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం వల్లే గురుకుల పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు నాణ్యమైన భోజనం పెట్టేలా చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగాధర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు చేపట్టాలని, విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వపరంగా అధికారులు స్పందించకపోతే  విద్యార్థినీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సుంకె రవిశంకర్ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ మండల  అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, మాజీ సర్పంచులు కంకణాల విజేందర్ రెడ్డి, శ్రీ మ్ల మేఘరాజ్, వేముల దామోదర్, ఎండి నజీర్, రామిడి సురేందర్, వడ్లూరి ఆదిమల్లు, సముద్రాల అజయ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్  మామిడిపల్లి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love