రాష్ట్రంలో విచిత్రకరమైన పరిస్థితులు

– మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో విచిత్రకరమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డిది బలహీనమైన ప్రభుత్వం అనే అభిప్రాయముండేదనీ, ఇప్పుడు రేవంత్‌ పాలన అంతకుమించి బాధ్యతారాహ్యితంగా కొనసాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నేతలు చింతల వెంకటేశ్వరరెడ్డి, తుంగబాలు తదితరులతో కలిసి జగదీశ్‌రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. వీధి కుక్కలను సైతం నివారించలేని దుస్థితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని ఆయన విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి హరీశ్‌రావు అన్న మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలోనే ఆ ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని గురుకులాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీకి సర్కారు కేవలం రూ.12 వేల కోట్లను విడుదల చేసి చేతులు దులుపుకుందని దుయ్యబట్టారు.

Spread the love