
– చేపల వేటకు వెళ్లి జాలరి సందిరి లక్ష్మన్ గల్లంతు
– గాలింపు ప్రక్రియను పర్యవేక్షించిన ఎమ్మెల్యే,ఆర్డీఓ, సీఐ
నవతెలంగాణ-బెజ్జంకి
చేపల వేటకు వెళ్లిన జాలరి గల్లంతైన సంఘటన మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం సందిరి లక్ష్మన్ గ్రామంలోని తోటపల్లి ఆన్ లైన్ రిజర్వాయర్ యందు స్థానిక ముదిరాజ్ లతో కలిసి చేపల వేటకు వెళ్లారు.జోరుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఆన్ లైన్ రిజర్వాయర్ లోకి వరద ఉదృతి పెరగుతుండడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది.రిజర్వాయర్ లోని నీరు ఔట్ ప్లో ద్వార వెళ్లడాన్ని గమనించిన జాలర్లు ఇంటికి వెళ్లడానికి సంసిద్దమయ్యారు. పలువురు జాలర్లు ఆటోపై వెళ్లగా లక్ష్మన్ తన సైకిల్ ను రిజర్వాయర్ బయటకు వెళ్లే కాల్వపై బ్రిడ్జి అవతలి వైపు నిలపి వెనక్కు వచ్చి తిరిగి వెళ్లాడానికి యత్నించే క్రమంలో బ్రిడ్జీపై వరద ఉదృతి పెరిగి గల్లంతయ్యాడు.
ముమ్మరంగా గాలింపు..
వరదలో గల్లంతైన జాలరి లక్ష్మన్ అచూకి కోసం సీఐ శ్రీను అగ్నిమాపక,స్థానిక పోలీసుల సిబ్బంది,గజ ఈతగాల్ల సహాయంతో ముమ్మరంగా గాలింపు ప్రక్రియ చేపట్టారు.ఘటన స్థలానికి కనుచూపు మేర వరద కాల్వలో గల్లంతైన జాలరి పాదరక్షలు లభ్యమైనట్టు అధికారులు గుర్తించారు.ఆర్డీఓ రామ్మూర్తి,తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీడీఓ ప్రవీన్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు:ఎమ్మెల్యే కవ్వపల్లి
అధికార యంత్రాంగం జాలరి అచూకి కోసం చేపట్టిన గాలింపు చర్యలను మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీ వెలిచాల రాజేందర్ రావు,స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యవేక్షించారు.అనంతరం జాలరి గల్లంతైన ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.వరద ఉదృతికి జాలరి సుందరి లక్ష్మన్ గల్లంతవ్వడం బాధకరమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.ప్రభుత్వం ప్రజల క్షేమం కొరకు అప్రమత్తంగా ఉండాలని ప్రసార మాధ్యమం ద్వార సూచించిందని ప్రభుత్వ సూచనలు పాటించాలని ఎమ్మెల్యే కోరారు.ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య,మాజీ సర్పంచ్ బోయినిపల్లి నర్సింగ రావు తదితరులు హజరయ్యారు.
వరద ఉదృతి తగ్గుముఖం పడితేనే..
అధికార యంత్రాంగం పలు మార్లు గాలింపు చర్యలు చేపట్టిన జాలరి అచూకీ లభ్యమవ్వలేదు.వరద ఉదృతి తగ్గుముఖం పడితేనే జాలరి అచూకీ లభ్యమయ్యే అవకాశాలున్నాయని అధికార యంత్రాంగం అంచనా వేస్తున్నారు.