హమ్మయ్య… అమ్మ చచ్చిపోయింది!

Hmmm... Mom is dead!”హమ్మయ్య, అమ్మ చచ్చిపోయింది” అనుకున్నారు లోపల.
”అయ్యో! అమ్మ చచ్చిపోయింది” అంటూ పట్టలేనంత దు:ఖంలో పడ్డారు; బయట…
వాళ్ళు ఆమె సంతానం – ఏడుగురు పాండవులు, ఒక ముద్దుల కూతురు.
”దేవుడా, ఇంతమంది పిల్లల్ని కనికూడా నాకెందుకీ ఒంటరితనపు శిక్ష? ఇంతకన్నా నన్ను మా ఆయన ఉన్న చోటికి తీసుకొనిపోవచ్చు కదా!” అనుకుంటూ ఆరాత్రి కుమిలి కుమిలి ఏడ్చింది కుంతమ్మ. ఆమె ఆ రాత్రంతా అలా తనలో తను కుమిలిపోతూనే ఉంది.
అకస్మాత్తుగా గుండెపోటుతో తన భర్త చనిపోయిన సంఘటన, తరువాత పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకోసం తను పడ్డ కష్టాలు, తన బాల్యం, ఎందరో కలిసి వున్న ఉమ్మడి కుటుంబంలో తన తల్లిదండ్రులతో, అనేకమంది తన వాళ్ళనడుమ తను పుట్టి పెరిగిన నాటి పల్లెటూరి జ్ఞాపకాలు, తన బాల్యస్నేహితులతో ఆటల్లో, ముచ్చట్లలో ఆనందంగా ఐస్‌క్రీముల్లా కరిగిపోయిన రోజులు… అనేక దృశ్యాలు… ఆమె జ్ఞాపకాల్లో ప్రవహించాయి. ఆమెను ఆ కాలానికి తీసుకుపోయి ఊరడించే వ్యర్థ ప్రయత్నం చేశాయి. ఓ ట్రాన్స్‌ లాంటి స్థితిలో రాత్రి మూడు గంటలు దాటింతరువాత తనకు తెలియకుండానే మగత నిద్రలోకి జారిపోయింది ఆమె.
అక్కడ ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి కనబడ్డాడు. సూటూ బూటూ వేసుకుని అమెరికా అధ్యక్షుడిలా ఉన్నాడు. కానీ అమెరికా అధ్యక్షుణ్ణి కుంతమ్మ ఎప్పుడూ చూడలేదు. కనుక ఎవరో పెద్దమనిషి అనుకుంది. ఆ మొహం చూస్తుంటే బాగా తెలిసినట్టే ఉంది. కానీ ఎక్కడ ఎప్పుడు చూసిందో గుర్తుకు రావడంలేదు. అతడే ఆమెను గుర్తుపట్టినట్టుగా ”హలో కుంతమ్మా!” అంటూ చిరునవ్వుతో పలకరించాడు. ఆ నవ్వు చాలా అందంగా, ఆకర్షించేలా ఉంది. కానీ అది సహజమైన నవ్వు కాదని, కృత్రిమంగా అలవాటు చేసుకున్న నవ్వని అనిపించింది. తనకు తెలియకుండానే రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది. ఎందుకో అతణ్ణి చూస్తుంటే భయమో భక్తో, ఆ రెండో ఆమెకు కలిగాయి.
”మీరు…?” అని అడిగింది, మెల్లెగా సందేహపడుతూ.
అతడు మళ్ళీ ఓ కృత్రిమమైన అందమైన చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు, ” నేను మీ లాంటి వాళ్ళ బాధలు పోగొట్టే కార్పోరేట్‌ హాస్పిటల్‌ లాంటివాణ్ణి. నేను యముణ్ణి, మృత్యువును, మామూలు వాడుక భాషలో చావును” అతని మొహంమ్మీద చిరునవ్వు అలాగే ఉంది. ఆ గొంతుకూడా ఎంతో మృదువుగా, హుందాగా వినిపిస్తోంది. కానీ అదీ సహజంగా అనిపించలేదు ఆమెకు.
ఆ జవాబు విని ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. తరువాత కొంచం భయపడ్డది. నమ్మలేనట్టు చూసింది. యముడైతే ఇంత దర్జాగా ఉండడు కదా అనుకుంది. తాను యన్టీ రామారావును యముడి వేషంలో సినిమాలో చూసింది. ఆయనైతే ఇలా లేడు మరి. ఇతడెవరో ఇంగ్లీషు వాడు. అబద్దం చెప్తున్నాడు. అనుకుంది. యముడైతే నాకెందుకు కనబడ్డాడు అనుకుంది.
”నీ అనుమానాలు నాకు అర్థమౌతున్నాయి కుంతమ్మా! కాల ధర్మాన్ని బట్టి మేమూ మారుతున్నాం. ప్రపంచీకరణ మిమ్మల్నే కాదు, మమ్మల్ని కూడా మార్చేస్తున్నది. ఇప్పటి సినిమాలో నన్ను ఇలాగే చూపిస్తున్నారు. ఈనాటి సినిమాలు చూసే ఆలవాటు నీకు లేదు; కనుక నీకు తెలియదు. నీవింకా యన్టీఆర్‌, ఏయన్‌ ఆర్‌ల కాలంలోనే ఉన్నావ్‌. అందుకే నీకు నా మీద నమ్మకం కలగడం లేదు. కానీ ప్రామిస్‌గా నేను యముణ్ణే, ఒట్టు” తలమీద చేయి పెట్టుకొని చెప్పాడు.
”ఈ ఆధునిక ప్రపంచీకరణ కాలంలో బీభత్స భయానకాలూ, చావులూ ఏడుపులూ అన్నీ ఇలాగే అందంగా, గొప్పగా, ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి. కానీ ఏదీ సరిగ్గా తెలియదు. అన్నీ అర్థమౌతున్నట్టుగానే అనిపిస్తాయి, కానీ ఏదీ కరెక్టుగా అర్థం కాదు… సరే ఇదంతా నేను ఇప్పుడు నీకు వివరంగా చెప్పినా నీకు అర్థం కాదు. మీలోకంలో మేధావులూ, ప్రొఫెసర్లూ చెప్పే మాటల్లాగే విన్నవి విన్నట్టుగా గాలిలో కలిసిపోతాయి. సరే, ఆ సంగతి అలా వదిలేద్దాం.”
కుంతమ్మకు ఆ వ్యక్తి మాటలు అర్థమై అర్థం కానట్టుగానే అనిపించాయి. జోడించిన రెండు చేతుల్ని అలాగే కలిపి ఉంచి, ఓ బాబాముందు భక్తురాలిలా అలా నిలబడిపోయింది. ఆ వ్యక్తే మళ్ళీ మాట్లాడాడు. ”మా లోకంలో బంపర్‌ ఆఫర్లు ప్రవేశపెట్టాం. దాని అవకాశం ఈసారి నీకే ఇస్తున్నాం. అందుకే నీకు ఓ మంచి బహుమతిలాంటి వరం ఇచ్చిపోవాలని వచ్చాను. పుట్టెడు దు:ఖంలో ఉన్నట్టున్నావు, కనుక కోరుకో నీకేం వరం కావాలో” అంటూ వరమిచ్చే భంగిమలో స్టైల్‌గా నిలబడ్డాడు ఈ కాలపు చిరునవ్వుతో.
అతడు చెప్పింది కొంతే అర్థమైనట్టు అనిపించింది ఆమెకు. అదికూడా నిజమో కాదో తెలియదు. సరే, వరం ఏదో ఇస్తానంటున్నాడు కదా, అడిగిచూద్దాం అనుకుంది కుంతమ్మ. ”స్వామీ! ఊరు పొమ్మంటున్నది, కాడు రమ్మంటున్నది. నాకు ఇందరు పిల్లలున్నారు. ఐనా ఒంటరిగా బతుకుతున్నాను. నా బిడ్డలకు నేను ఇప్పుడు బరువులాగా అనిపిస్తున్నాను. వాళ్ళెవరూ నేను తమ దగ్గర ఉండాలని కోరుకోవడం లేదు. ‘అమ్మ మాకు వద్దంటే మాకు వద్దని’ ఏవో కుంటి సాకులు చెప్తున్నారు. దయచేసి మీరు వాళ్ళ మనసులు మార్చండి. నేను వాళ్ళతో కలిసి ఉండేలా వరం ఇవ్వండి చాలు,” అని ఆశగా దోసిలి చాచింది వరం ఇస్తే తీసుకుంటానన్నట్టు.
అతని ముఖంలో రంగులు మారిపోయాయి. సెంటు ఇగిరిపోయింది. చమట పట్టింది. మేకప్‌ చెదిరి పోయింది. చాలా కంగారు పడ్డాడు. ”ఆపని ఇప్పుడున్న పరిస్థితులలో నేను అస్సలే చేయలేను తల్లీ, మరేదైనా కోరుకో” అన్నాడు తన నిస్సహాయత ప్రకటిస్తూ.
”అదేం స్వామీ? నేనేమైనా కోరరాని గొంతెమ్మ కోరిక కోరానా? పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఉండకూడదా స్వామీ?…” అర్థంకానట్టు ఆశ్చర్యపోతూ అడిగింది.
”కాదు, కానీ ఈనాటి పరిస్థితులలో అది సాధ్యం కాదు”
”ఎందుకు స్వామీ? నా తప్పేమైనా ఉందా?”
”నీ తప్పేమీ లేదు. నిజానికి ఎవరి తప్పూ లేదు. మరో రకంగా అందరిదీ తప్పే. కానీ ఎవరికి వాళ్ళకు తప్పులేదు. ఊహూ… ఇలా కాదుకానీ, ఇది సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగమైన సంస్కృతి… అర్థం కాలేదు కదా! ఎలా చెప్పినా నీకు అర్థం చేయించలేను. ఇది నీకు అర్థం కాదు. పోనీ కలికాలం ఇలాగే ఉంటుందనుకో. ఇది ఈ యుగ ధర్మం. మీ లాంటివాళ్ళ కర్మం, అంతే”
”ఏమైనా సరే. నా కోరిక తీర్చండి స్వామీ.”
”అది నావల్ల కాదు తల్లీ! ప్లీజ్‌ అర్థం చేసుకో…”
”అయితే మీరు వెళ్ళండి స్వామీ. నేనూ మీ వెంటే వస్తాను; పదండి. నాకిక్కడ ఇక ఉండాని లేదు.”
ఆ వ్యక్తి గిల్టీగా ఫీలయినట్టున్నాడు. బుర్ర వేడెక్కినట్టుంది. ఏదో ఆలోచిస్తూ కాసేపు మౌనంగా నిలబడ్డాడు. నీవిప్పుడు నాతో రావడానికి అవకాశం లేదే, ఎలా?.. సరే, ఈనాటి మీ కార్పోరేటు హాస్పిటల్స్‌లా కొంత కాస్‌ట్లీగా కన్ఫూజ్‌ చేసి చూస్తాను” అని టక్కున మాయమైయ్యాడు. అస్పష్టమైన కలలాంటి ఆ స్థితిలోంచి కుంతమ్మ ఇంకా గాఢ నిద్రలోకి వెళ్లిపోయింది.
ఆరోజు పొద్దున జరిగిన ఓ సంఘటన ఆమె జ్ఞాపకాల్లో లీలగా తిరుగుతున్నది- ”నేను నా పెద్దకొడుకు దగ్గర ఉంటాను,” అన్నది ఆమె.
”ఉహూ. నా దగ్గర ఎలా కుదురుతుంది? నాకూ, నా భార్యకూ అనారోగ్యాలు. పైగా నేను నా పనులతోటి ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. మా ఆవిడకు అస్తమా, బీపీ, షుగర్‌, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి చాలా ఉన్నారు. ఆమె పనులు ఆమెకే కష్టం. మా బాబు సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. పాప పదోతరగతి. అమ్మకు ఎప్పుడూ టీవీ నడుస్తుండాలె. పిల్లలకు డిస్టర్బ్‌ అయితది… సారీ. అమ్మ నాదగ్గర ఉండుడు కుదరది. కావాలంటే కొంత డబ్బు ఇస్తా…” తన ఉద్వేగాన్నీ, తల్లిని ఎక్కడ తన దగ్గర ఉంచుకోవలసి వస్తుందోననే ఆందోళననూ అణుచుకుంటూ గట్టిగా చెప్పాడు ఆమె పెద్దకొడుకు ధర్మవీర ప్రశాంత ప్రవీణ్‌.
గుండెలమీద గడ్డపారలతో పొడిచినట్టయింది ఆమెకు. మనసులోంచి దు:ఖం బలంగా పెకిలి వచ్చింది. తన పెద్దకొడుకు ఇంత కఠినంగా, తిరస్కారంగా మాట్లాడ్డాన్ని జీర్ణం చేసుకోవడం ఆమెకు సాధ్యం కావడం లేదు. తల్లిగా తాను వాడికోసం ఎన్ని చేసింది, ఎన్ని భరించింది. వాణ్ణి ఎంత ప్రేమగా చూసింది… ఒకరో ఇద్దరో పిల్లలు చాలనుకునే రోజులు కావవి. ప్రతి కానుపుకూ చావుముందు నిలబడి, ఇందరు బిడ్డల్ని కని, ఈరోజు అనాథలా ఇలా….
మిగతా వాళ్ళు కూడా దాదాపు అందరూ తమ అన్నలాగే మాట్లాడారు. ‘అమ్మకూ, తమ భార్యలకూ కుదరదని, అమ్మ చాదస్తాన్ని భరించడం కష్టమని, తమ సంపాదన సరిపోదని, అప్పుల్లో, కష్టాల్లో ఉన్నామని, ఇల్లు చిన్నదని, సౌకర్యంగా ఉండదని, పిల్లల చదువులకు ఇబ్బందని, నెలకు కొంత డబ్బు ఇస్తామని, అమ్మంటే తమకు ఎంతో ప్రేమ ఉందని, కానీ తమ పరిస్థితి సరిగా లేదని’ తమ తల్లిపట్ల తమ అశక్తతను తెలియజేశారు. చాలా కళాత్మకంగా, రకరకాల అభినయాలతో, విచారాలతో, సానుభూతులతో….
”నాకు వేరే మీటింగ్‌ ఉంది. అక్కడికి మంత్రిగారు వస్తున్నారు. నేను ప్రధాన వక్తగా మాట్లాడాల్సి ఉంది. కనుక నేనిక వెళ్ళాలి. మరో రోజు కూచుందాం. లేదంటే మీరే ఆలోచించండి. అమ్మను మాతో వుంచుకోవడం మాత్రం నాకు వీలుకాదు. దయచేసి అర్థం చేసుకొండి” అని చెప్పి అలా మధ్యలోంచి అకస్మికంగా వెళ్ళిపోయాడు ధర్మవీర ప్రశాంత ప్రవీణ్‌.
”పెద్దన్న లేకుండా మనం ఏం మాట్లాడుతాం? మరోసారి ఎప్పుడైనా చూద్దాం” అంటూ మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె పుట్టెడు దు:ఖంతో ఒంటరిగా తన పాత ఇంటికి వెళ్ళిపోయింది. ఆరాత్రి ఆమెకు చరమరాత్రి అయింది.
ష ష ష
”అయ్యో, అమ్మ చచ్చిపోయిందట!…” అంటూ ఆమె పిల్లలందరూ బోరున ఏడుస్తూ అక్కడికి వచ్చారు. ఆ వీధంతా, ఆ ఇల్లంతా, ఆ వాతావరణమంతా వాళ్ళ దు:ఖంతో కుంభవృష్టిలా కురిసింది. కన్నీళ్ళు వరదలై పారాయి. ఏడుపులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి. రకరకాల శోకాలు… చిన్న పిల్లలందరూ ఏం జరుగుతుందో అర్థంకాక భయపడిపోతున్నారు. వచ్చిన వాళ్ళు ఆమె కొడుకులనూ, కోడళ్ళనూ ఊరడిస్తున్నారు. ”అమ్మను మాతో వచ్చి ఉండమని ఎంత బతిమాలినా రాలేదు. ఆమెకు మా నాన్న కట్టించిన ఈ ఇల్లంటే ప్రాణం. ఆమె జీవితమంతా ఇక్కడే గడిపింది. ఈ ఇంటికి ఆమె ఎంతో చేసింది. ఆమె జ్ఞాపకాలన్నీ దీని చుట్టే పెనవేసుకొని ఉన్నాయి. మమ్మల్ని ఇక్కడే కని, పెంచింది. మా బాల్యంలో మా కోసం, మమ్మల్ని గొప్పగా పెంచడం కోసం అమ్మ ఇక్కడ ఎన్ని అవస్థలు పడిందో, ఎన్నెన్ని కష్టాలు పడ్డదో మాకింకా కళ్ళకు కట్టినట్టే జ్ఞాపకం ఉంది. అయ్యో, అమ్మా! మమ్మల్ని ఇలా అనాథల్ని చేసి పోయావెందుకు? తల్లి దండ్రులు లేని మేం మా కష్టసుఖాలు ఎవరికి చెప్పుకోవాలి? నాన్న పోయాక కనీసం నువ్వయినా మాతో లేవెందుకు? అయ్యో అమ్మా…”
వాళ్ళ ఏడుపులతో లోకం మునిగిపోతుందేమోనని, ప్రపంచమంతా చీకటైపోతుందేమోనని అక్కడికి వచ్చిన కొందరు సందేహపడ్డారు. అక్కడికి వచ్చిన వాళ్ళలో వాస్తవాలు తెలిసిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. వాళ్ళు కూడా ఆ పిల్లలకు వచ్చిన కష్టానికి తమ నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘అయ్యో పాపం’ అని ఓదారుస్తున్నారు, విషాదాన్ని ప్రకటిస్తున్నారు. వేదాంతాన్ని బోధిస్తున్నారు. ఆమె సంతానమంతా సముద్రమంత శోక ముఖాలతో, ‘ఇక ఈ ఇల్లు అమ్మేయొచ్చు. అమ్మేస్తే ఎవరికెంత వాటా వస్తుందోనని ఎవరికివాళ్ళు లోలోపల లెక్కలు వేసుకుంటున్నారు.
ఒకవైపు ఏడుపులూ, లెక్కలూ, మరొక వైపు అంత్యక్రియల ఏర్పాట్లూ కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం పన్నెండు వరకు పాడె తయారైంది. చేయాల్సినవన్నీ చేసి, ఆమెను పాడెపైకి చేర్చారు. అక్కడ్నుంచి కొంతదూరం నడిచిన తర్వాత, స్వర్గానికి తీసుకెళ్ళే వాహనంలోకి చేర్చారు. భగవద్గీత శ్లోకాలతో, బలగం పాటలతో ఆమెను స్మశానానికి చేర్చారు.
అక్కడ అప్పటికే నాలుగైదు శరీరాలు శవాలై కాలిపోతున్నాయి. ఆ ప్రాంగణమంతా విషాదపు పొగ సుడులు తిరుగుతున్నది. అక్కడ ఓ సిమెంటు బెంచీమీద ‘దింపుడు గళ్ళెం’ అని కుంతమ్మ పాడెను దించారు. ఏడుస్తూ చుట్టూ చేరారు. పంతులుగారు వాళ్ళతో కొన్ని కార్యక్రమాలు చేయించారు. చివరిసారిగా ఆమె పిల్లలు ఆమె చెవిలో గట్టిగా ‘అమ్మా అమ్మా అని పిలవాలని’ చెప్పారు. ముందుగా పెద్ద కొడుకుతో మొదలై వరుసగా ”అమ్మా, అమ్మా…” అని దు:ఖంతో వాళ్ళు పిలుస్తున్నారు.
అప్పుడు జరిగింది…. వాళ్ళు ఎవరూ ఊహించని సంఘటన…. కూతురు పిలుస్తుండగా…. ఆ శవం చటుక్కున కళ్ళు తెరిచింది. కొద్దిగా తలను కదిలించింది. పెదవులు కూడా చిన్నగా కదిలించి బలహీనంగా ఏదో అంది.
వాళ్ళు మొదట భయపడ్డారు. దూరంగా జరిగారు. ఆమె కళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్చి చూస్తున్నది. ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నది. తల కొంచెం అటూ ఇటూ కదిలిస్తున్నది. అలా కొంత సేపు గడిచాక, వాళ్ళలో కూతురే కొంచెం ధైర్యం చేసి, ముందుకు వచ్చి కొద్దిగా వంగి చూసింది. ఆమె కూడా తన కూతురును చూస్తూ, ”నాన్నా… నీళ్ళు…” అంది బలహీనంగా. ఆమె కూతురే మెల్లగా వంగి నుదుటిని ముట్టి చూసింది.
అమ్మ ఒళ్ళు వెచ్చగానే ఉంది. చేయి పట్టుకుని చూసింది. నాడి కొట్టుకుంటున్నది. అంటే ఆమె బతికే ఉంది. తామే… గుర్తించడంలో పొరబడ్డారు. తొందరపడి ‘హమ్మయ్య, అమ్మ చచ్చి పోయిందనుకున్నారు’.
మళ్ళీ ”నీళ్ళు” అందామె కొంచెం వినిపించేలా. వెంటనే పక్కనున్నవాళ్ళు నీళ్ళ బాటిల్‌ తెచ్చిచ్చారు. ఆమెను కట్టి ఉంచిన పురికొసలు విప్పి, లేపి కూర్చోబెట్టారు. క్షణాల్లో ఈ విచిత్రమైన వార్త పాకిపోయింది. అందరూ అక్కడికి వస్తున్నారు. కొందరు సెల్‌ పోన్లలో చిత్రిస్తున్నారు. ఇసుక వేస్తేరాలనంత జనం. అంతా సందడి. గోల గోలగా తయారైందక్కడ. చచ్చిపోయిందనుకున్న కుంతమ్మ బతికే ఉంది. అమ్మ బతికే ఉంది… అయ్యో, అమ్మ బతికే ఉంది… అమ్మ చచ్చిపోలేదు. చచ్చిపోయినట్టు అనిపించింది. లోకానికి అదో వింత, అద్భుతం, టీవీలకూ, యూట్యూబ్లకూ, ఫేసుబుక్‌లకూ, ట్విట్టర్లకూ ఇతర వార్తా చానళ్ళకూ అదో రేటింగ్‌ పెంచే బ్రేకింగ్‌ న్యూస్‌.
కానీ, ఆమె పిల్లలకు?… ఇతర కుటుంబ సభ్యులకు?… ఆమెకు?… తరువాత ఏమైందో… ఏమైవుంటుందో దాన్ని మీరే మరో కథగా ఊహించుకోండి.
– డా. వి.ఆర్‌.శర్మ. 9177887749

Spread the love