ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

– రెండు స్థానాల్లో సీపీఐ(ఎం) పోటీ
– అభ్యర్థుల ఎంపిక
న్యూఢిల్లీ : రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు (కరావాల్‌ నగర్‌, బాదర్‌పూర్‌) నుంచి సీపీఐ(ఎం) పోటీ చేయనుంది. ఈ మేరకు ఢిల్లీ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను కూడా ఎంపిక చేసింది. కరావాల్‌ నగర్‌ నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది, గుర్తింపు పొందిన సామాజిక కార్యకర్త అశోక్‌ అగర్వాల్‌ పోటీ చేయున్నారు. అలాగే అశోక్‌ అగర్వాల్‌ పిటీషన్ల కారణంగానే ప్రయివేట్‌ పాఠశాలల్లో 20 శాతం సీట్లు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు లభించాయి. అలాగే గుర్తించిన 47 ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి కింద 10 శాతం ఇన్‌పేషంట్లను, 25 శాతం అవుట్‌ పేషంట్లకు చికిత్స అందిస్తున్నారు.కాగా, బాదర్‌పూర్‌ నుంచి జగదీష్‌ చాంద్‌ శర్మను సీపీఐ(ఎం) పోటీకి నిలిపింది. మీఠాపూర్‌కు చెందిన జగదీష్‌ ఈ ప్రాంతంలో జరిగిన అన్ని ప్రజా పోరాటాల్లోనూ ముందుండేవారు. ఈ ప్రాంతంలో ఒక ప్రధాన భాగాన్ని ‘ఓ’ జోన్‌లో ఉంచడానికి ఢిల్లీ డెవలెప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి నిర్ణయంతో నిర్మాణ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, మొత్తంగా ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అక్రమంగా ఏర్పాటు చేసిన జీన్స్‌ డైయింగ్‌ యూనిట్లు, ల్యాండ్‌ మాఫియాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటలకు నాయకత్వం వహించారు. అలాగే, ప్రజానుకూల, వామపక్ష ప్రత్యామ్నాయ విధానాల ఆధారంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం)ప్రచారం నిర్వహించనుంది. ఢిల్లీలో పదేండ్లకుపైగా సాగుతున్న ఆప్‌ ప్రభుత్వ పనితీరును శ్రామిక ప్రజానీకం పరిశీలించాల్సిన సమయమని, మరోవైపు ఎన్నికల్లో లబ్ది కోసం ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ అనుసరించే మతరాజకీయాలను ఎదుర్కొనే సమయమని పార్టీ పేర్కొంది. 19న ప్రెస్‌క్లబ్‌లో జరిగే విలేకరుల సమావేశంలో ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన వామపక్ష పార్టీల మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని పార్టీ ఆహ్వానించింది.

Spread the love