నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామపంచాయతీ లోని కొడిశల, ఒడ్డుగూడం, లింగాల.. బంధాల గ్రామపంచాయతీ పరిధిలోని బొల్లెపల్లి గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్స్ ఉండి, సిగ్నల్స్ లేక ఆదివాసి గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒడ్డుగూడెం, కొడిశెల, లింగాల, బొల్లెపల్లి ఆదివాసి గిరిజన గ్రామాల్లో సెల్ టవర్లు వేసి సుమారుగా సంవత్సరం దాటినా ఇప్పటికీ బిఎస్ఎన్ఎల్ అధికారులు సిగ్నల్ ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారని ఆదివాసి గిరిజనులు మండిపడుతున్నారు. బంధాల గ్రామపంచాయతీలో ఎయిర్టెల్ టవర్ నిర్మించి సిగ్నల్ వదిలారు. బంధాల గ్రామంలోని ఆదివాసీలు సంవత్సర కాలం నుంచి సిగ్నల్ లో ఆన్లైన్ వ్యాపార వర్తక సంబంధాలు, మానవ సంబంధాలు నిర్వహిస్తున్నారు. లింగాల గ్రామపంచాయతీ పరిధిలో ఒడ్డుగూడెం, కొడిశల, లింగాల, బొల్లిపెల్లి గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లు నిర్మించారు. కానీ సుమారు సంవత్సరం దాటిన ఇంతవరకు సిగ్నల్ ఇవ్వలేదు.
బంధాల గ్రామంలో ఎయిర్టెల్ టవర్ నిర్మించిన అతి తక్కువ సమయంలోనే సిగ్నల్ ఇచ్చారు. అక్కడి ప్రజలు అన్ని ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ఇక బిఎస్ఎన్ఎల్ టవర్ లు నిర్మించిన ఒడ్డుగూడెం, కొడిశల, లింగాల, బొల్లిపెల్లి గ్రామాలలో సంవత్సరం దాటిన సిగ్నల్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. సిగ్నల్ లేకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు ఆన్లైన్ అనుసంధానం కావడంతో గ్రామస్తులందరూ సిగ్నల్ వచ్చే చోట ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ చేసుకుంటూ రోజంతా ఇబ్బందులు పడుతున్నారు. బంధువులకు మిత్రులకు సమాచారం ఇవ్వాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అనారోగ్యం బారిన పడితే 108 కు ఫోన్ చేయడానికి వాటర్ ట్యాంకు, గుట్ట, లేదంటే చెట్టు ఎక్కి ఫోన్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో అక్కడి ఆదివాసి గిరిజనులు సెల్ ఫోన్లు సిగ్నల్ లేక పడుతున్న దుస్థితి ఎంతో అర్థమవుతుంది. బిఎస్ఎన్ఎల్ టవర్ల కంటే దూరంలో దట్టమైన అడవిలో గుట్టల నడుమ బంధాల గ్రామంలో నిర్మించిన ఎయిర్టెల్ టవర్ వారు ఎయిర్టెల్ సిగ్నల్ ఇచ్చారు. కానీ దీని కంటే కొంత రోడ్డు మీద ఉండే గ్రామాలకు బిఎస్ఎన్ఎల్ టవర్లు నిర్మించి సిగ్నల్ ఇవ్వకపోవడంతో బిఎస్ఎన్ఎల్ సంస్థపై అక్కడి ఏజెన్సీ ప్రజలు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మాకు ఎయిర్టెల్ టవర్ నిర్మించిన ఇప్పుటికే సిగ్నల్ ఇచ్చేవారని, ఈ బిఎస్ఎన్ఎల్ వారు సెల్ టవర్స్ నిర్మించి, ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండల కేంద్రానికి మారుమూల ప్రాంతమైన, 100% ఆదివాసి గిరిజనులు నివసిస్తున్న ఆదివాసి గ్రామాలైన ఒడ్డుగూడెం, కొడిశల, లింగాల, బొల్లెపెల్లి మొదలైన బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్స్ నిర్మించిన గ్రామాలలో సెల్ టవర్స్ కు సిగ్నల్ ఇవ్వాలని ఆదివాసి గిరిజనులు కోరుకుంటున్నారు.