గొల్ల కురుమలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం ..

Failed to implement the promises given to Golla Kurumas..– జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ యాదవ్ 

– జీఎంపీఎస్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ 
నవతెలంగాణ – పెద్దవంగర
గొల్ల కురుమలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గొర్రెల మేకల పెంపకందారు సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతులో నొక్కి ఎందుకు కుట్ర చేస్తున్నాదని విమర్శించారు. గత ప్రభుత్వం గొల్ల కురుమలకు మోసం చేసినట్టే, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మొండి చేయి చూయించి అప్పులు చేసి డీడీలు చెల్లించిన గొల్ల కురుమలకు డబ్బులు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. గొల్ల కురుమల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేకపోవడం గమనార్హం. పశుసంవర్ధ శాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడంతో ముఖ్యమంత్రి దగ్గరే పశుసంపర్ధక శాఖ ఉండడంతో సమస్యలపై కలిసే అవకాశం లేకపోవడంతో గొల్ల కురుమలు సమస్యలను ఎవరికి మోర పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి గొల్ల కురుమల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వెంటనే సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని, గొర్రెలు మేకల పశుగ్రాసం కోసం ప్రతి గ్రామంలో సొసైటీకి 10 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన గొల్ల కురుమలకు వృద్ధాప్య పెన్షన్ అందించాలని, ప్రమాదవశాత్తు మరణించిన గొల్ల కురుమలకు రూపాయలు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. యాదవులు ఐక్యంగా ఉంటూ, అన్ని రంగాలలో రాణించాలని, త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకం దారుల మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మనబోయిన యాకయ్య, సంఘం మండల అధ్యక్షుడు కేశబోయిన మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి కందుల బుచ్చన్న, ఉపాధ్యక్షులు కందుల శ్రీశైలం, కోశాధికారి కుమ్మరి రామ్మూర్తి, ముఖ్య సలహాదారులు కసరబోయిన కుమారస్వామి, కూకట్ల వీరన్న, ఎరసాని రామ్మూర్తి, ఆవుల మహేష్, భారీ విక్రమ్, సలహాదారులు నిమ్మల వీరన్న, ఊడుగుల రమేష్, కందుల యాకరాజు, పల్లె కొమురయ్య, ఉడుత వెంకన్న, గజ్జి వేణు, సోమయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love