చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించాలి..

Historical heritage should be preserved.నవతెలంగాణ – భీంగల్ రూరల్
భీంగల్ కు చెందిన ప్రముఖ కవి, రచయిత, అస్మక చరిత్ర పరిశోధక మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, బాల్కొండ స్థానిక చరిత్రను అందరికీ తెలియజేయాలనే,ప్రాచీన చరిత్ర రక్షింపబడాలనే సదాశయంతో ఏర్పడిన “బాల్కొండ ఖిల్లా పరిరక్షణ సమితి” కార్యనిర్వాహక అధ్యక్షుడు, బాల్కొండ చరిత్ర గ్రంథ రచయిత బి.ఆర్ నర్సింగ్ రావు ప్రముఖ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం బాల్కొండ ఖిల్లా గుట్టపై పాఠశాల విద్యార్థులకు చరిత్రపై ఆసక్తిని పెంపొందించుటకు “బాల్కొండ ప్రాచీన చరిత్ర” అనే అంశంపై సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భీంగల్ కు చెందిన ప్రముఖ కవి, రచయిత,అస్మక చరిత్ర పరిశోధక మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి,అల్లకొండ సాహిత్య కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రామన్నపేట చరిత్ర గ్రంథ రచయిత, ప్రముఖ చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ ముఖ్య అతిథి, ప్రధాన వక్తగా  పాల్గొన్నారు. ముఖ్య అతిథి కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ.. దక్షిణ భారత్ లోనే అత్యంత ప్రాచీనమైన ప్రాంతం బాల్కొండ స్వతంత్ర రాజ్యాంగ ఉండేది. మల్లయోధులైన అల్లయ్య, కొండయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు అల్లకొండను   పరిపాలించారు. క్రీ.శ 1059 నుండి అల్లకొండకు ఘనమైన చరిత్ర కలదు. అల్లకొండ (బాల్కొండ) దాదాపు ఆ కాలంలోనే  39 ఎకరాలకు పైగా విస్తీర్ణంతోనూ, చుట్టూ 9 కొండలతో, కోటకు ప్రధానంగా 6 ప్రవేశ ద్వారాలు, కోట చుట్టూ కందకం, కందకంలో మొసళ్లను పెంచేవారు. అల్లకొండను రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, బహుమనీలు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు పాలించారు. ఇలా బాల్కొండ చరిత్రను కంకణాల రాజేశ్వర్ వివరించారు.
మద్రాసు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నత హోదాలో (1780-1836)లో పనిచేసిన ఏనుగుల వీరాస్వామి 1830 లో కాశీ యాత్రలో భాగంగా హైదరాబాద్ పట్టణం నుండి బయలుదేరి ఆర్మూర్ మీదుగా పాదయాత్రగా జూన్ 26 నుండి 29 వరకు  యాత్ర చేస్తూ 3 రోజులు బాల్కొండ లోనే గడిపానని ఏనుగుల  వీరాస్వామయ్య రాసిన “యాత్ర చరిత్ర” గ్రంథంలో బాల్కొండ ప్రస్తావన ఉందని కంకణాల రాజేశ్వర్ ఈ సందర్భంగా విద్యార్థులకు చారిత్రక విషయాలను తెలియజేశారు. బాల్కొండ లో జరిగిన పులగం పండుగ సంపదను రామన్నపేట గ్రామవాసులు తీసుకెళ్లారని అందుకే రామన్నపేటలో పుష్కలంగా పంటలు పండుతాయి అని “గత మెంతో ఘన కీర్తి గడిచినవన్నీ బంగారు రోజులే” అని రామన్నపేట చరిత్ర గ్రంథ రచయిత, ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కంకణాల రాజేశ్వర్  విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా సుప్రసిద్ధ చరిత్ర కారుడు కంకణాల రాజేశ్వర్ బాల్కొండ ఖిల్లా గుట్టపై12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయం ముందు గల శిలాశాసనం, పెద్ద పెద్ద బురుజులు, కోటలు, భారీ ఫిరంగి, అశ్వశాల, గజశాల, సైనిక స్థావరాలు, ప్రాచీన కోనేరు, అత్తా కోడళ్ళ బావి, అల్లయ్య, కొండయ్యల శిలా విగ్రహాలు, పరమ శివ భక్తురాలైన సైదానబి సమాధి మున్నగునవి చూడవచ్చు అని సవివరించారు. శిథిలమై కనుమరుగవుతున్న బాల్కొండ చారిత్రక ఖిల్లా వారసత్వ సంపదను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించి సంరక్షించాలని ప్రభుత్వాలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు భూసం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బొట్ల మధుసూదన్, సంయుక్త కార్యదర్శులు సంతోష్, డి.పవన్ కుమార్, కార్యవర్గ సభ్యులు వెంకటేష్, అశోక్ ట్రావెల్ బ్లాగ్స్ యూట్యూబ్ సృష్టికర్త బొజ్జ అశోక్ కుమార్ (నిర్మల్ జిల్లా, లక్ష్మణ చాంద మండలంలోని పీచర గ్రామ వాస్తవ్యులు) బొమ్మడి శ్రీనివాసరెడ్డి, కోమన్ పల్లి నర్సయ్య, దేవి రమేష్, పిట్టల సందీప్, కేశపురం సుమన్,శాంభవి హై స్కూల్, నవీన్ హై స్కూల్, కృష్ణవేణి హై స్కూల్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయుడు శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం, అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి క్రియాశీల కార్యవర్గ సభ్యులు, విద్యార్థినీ, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
Spread the love