మళ్ళీ అమ్మాయే పుట్టిందా…!

Is the mother born again...!అర్థభాగమని, అమ్మతత్వమని
అదే మా తరతరాల ఆదర్శమని..
ఆడవారి అమాయకపు చిరునవ్వే
అవనిపై చీకటిని చెరిపేసే
అందమైన భావపు
వెలుగు కిరణాల చెలిమని
కవనాలలో.. కథల్లో.. సినిమాలలో..
సిరా చుక్కల విప్లవ గానంలో
సంస్కతి సాంప్రదాయాల
అలంకారపు జాడల్లో..
అక్షర సంద్రపు అలలు ఆగకుండా
ఎగిసెగిసి పడుతూనే వున్నాయి..!
అయ్యో మళ్ళీ అమ్మాయే పుట్టిందా..!
ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే జీవిత చదువులో మహిళలకు
స్వాతంత్య్రపు వివక్షత చూపుతుంటే
దిశల శవాల నిర్భయ ఘటనలు
పరువు చాటున కుల హత్యలు దారుణంగా జరుగుతుంటే
ఆడపిల్లల మాన, ప్రాణ అనాగరిక దాడులపై
ఇంకా మారని సమాజపు అజ్ఞానపు అంధకారాన్ని..
ముక్కలు ముక్కలుగా నరకాలని వుంది..!
మదర్‌ థెరిస్సా, మేరీ క్యూరీ పాదాల వద్ద పుష్పమై చెబుతున్నా..!
కల్పనా చావ్లా ధైర్యానికి కావ్యమై కదులుతున్నా..!
అంతరంగపు అనంత విశ్వంలో
అమ్మాయిల ఆలోచనలు ధవతారల్లా ఎదగనిద్దాం..!
స్వేచ్ఛ గా కలల్ని కననిద్దాం..!
మనమంతా మారి బానిసత్వపు చెరసాలను పగలగొట్టి
మహిళను అసాధారణ శక్తిగా గుర్తిద్దాం..!
ఆడ మగ తేడా లేని సమానత్వపు జెండాను
మన గుండె నిండా ఎగరనిద్దాం..!
‘మహిళా సాధికారత’ కావాలని మనం చెప్పాల్సిన
అవసరమేలేని నవ సమాజాన్ని నిర్మిద్దాం..!!
– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536

Spread the love