– చర్చలకు సిద్ధమంటూ ఖమేనీకి ట్రంప్ లేఖ
– రష్యాపై ఆంక్షలు, టారిఫ్‌ల అంశం పరిశీలన
వాషింగ్టన్ : ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపాలని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇరాన్ నాయకత్వానికి గురువారం ఒక లేఖ రాశారు. దీనివల్ల ఇరాన్‌కే ప్రయోజనాలు వున్నాయని, అందువల్ల వారు చర్చలకు అంగీకరిస్తారని భావిస్తున్నట్లు ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్ బ్రాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ శుక్రవారం చెప్పారు. ”వారు కూడా ఈ లేఖ రావాలని కోరుకుంటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంకో అణ్వాయుధాన్ని అనుమతించలేం. కాబట్టి మనం మరో ప్రత్యామ్నా యాన్ని చూసుకోవాల్సి వుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేనీని ఉద్దేశించి ఆయన ఈ లేఖ రాశారు.
రష్యాపై ఆంక్షలు?
ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కుదిరేవరకు రష్యాపై బ్యాంకింగ్ ఆంక్షలు, టారిఫ్‌లు విధించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ శుక్రవారం తెలిపారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రంగానే దాడులు జరుపుతోందన్న వాస్తవం ప్రాతిపదికగా పై చర్యలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మరింత జాప్యం జరగకుండా ఇరు దేశాలను చర్చల వేదిక వద్దకు తీసుకురావాల్సి వుందన్నారు.
కెనడా, మెక్సికో దిగుమతులపై సుంకాల పెంపు నెల రోజుల పాటు వాయిదా
కెనడా, మెక్సికోల నుండి వచ్చిన సరుకులపై సుంకాల పెంపు అమలును ట్రంప్ తాత్కాలికంగా నెల రోజుల పాటు వాయిదా వేశారు. తన నిర్ణయాలు మార్కెట్ సంక్షోభానికి కారణమవుతాయన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఆ రెండు దేశాలతో వాణిజ్యమనేది ప్రాంతీయ ఒప్పందం పరిధిలోకి వస్తున్నందున లెవీ విధింపునకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యతో కంపెనీలకు, వినియోగ దారులకు కొంత ఉపశమనం లభించినట్లైంది. ఎరువుల ఉత్పత్తికి కీలకమైన పొటాష్ కెనడా నుండి వస్తున్నందున దానిపై కొత్తగా విధించిన 25శాతం లెవీని కూడా ట్రంప్ తగ్గించారు. ఏప్రిల్ 2న మరిన్ని ప్రధానమైన చర్యలు వుంటాయని, ఆ రోజు నుండి మెక్సికో,కెనడాలపై ప్రతీకార సుంకాలు అమలవుతాయని తొలుత ట్రంప్ చెప్పారు.
విద్యా శాఖ వికేంద్రీకరణకు ఆదేశాలు ?
ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా విద్యాశాఖను వికేంద్రీకరించనున్నట్లు ట్రంప్ తెలిపారు. విద్యా శాఖ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ మంత్రికి ఆదేశాలు వెళ్లాయి. విద్యా శాఖను వికేంద్రీకరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 1979లో జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా వున్న సమయంలో విద్యా శాఖ ఏర్పడింది. సెనెట్‌లో 60ఓట్లు అనుకూలంగా రాకపోతే ఈ చర్య అమల్లోకి రాదు. ఈ వార్తలు డెమొక్రాట్లకు ఆగ్రహం తెప్పించాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఇది దాడి అని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు భావిస్తున్నారు.
పాలస్తీనియన్ ఖైదీలనూ గౌరవించండి ట్రంప్‌ను కోరిన హమాస్
ఇజ్రాయిల్ విడిచిపెట్టిన పాలస్తీనా ఖైదీలను కూడా గౌరవించాలని హమాస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరింది. హమాస్ విడుదల చేసిన ఇజ్రాయిల్ ఖైదీలను ట్రంప్ కలిసిన నేపథ్యంలో హమాస్ సీనియర్ నాయకుడు బాసెం నయిమ్ ట్రంప్‌కు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. విడుదలైన పాలస్తీనా రాజకీయ ఖైదీల బాధలను కూడా వినాలని ఆయన కోరారు. ఇజ్రాయిల్ జైళ్లలో ప్రస్తుతం 9,500 మందికిపైగా పాలస్తీనా వాసులు ఖైదీలుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.