
– ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య బృందం….
నవతెలంగాణ – అశ్వారావుపేట : వైద్యారోగ్య శాఖ నిబంధనలకు లోబడే ప్రయివేటు ఆస్పత్రులు నిర్వహించాలని,రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేయించుకోవాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ ప్రయివేటు వైద్యులకు సూచించారు.
జిల్లా వైద్య బృందం బుధవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని ప్రయివేటు ఆసుపత్రులను,ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
ముందుగా ఏరియా ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి ఆరోగ్య మిషన్ ప్రమాణాలు ప్రకారం రోగులకు సేవలు అందుతున్నాయా?లేదా?రోగులకు సరిపడా సౌకర్యాలు ఉన్నాయా?లేవా?సరిపడా వైద్యులు ఉన్నారా?లేరా? అనే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండార్డ్ స్ (ఐపీహెచ్ఎస్ ) ఫార్మాట్ ను నింపారు. రోగులు వద్దకు వెళ్ళి వారికి అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని వందన నర్సింగ్ హోమ్,శేషమ్మ నర్సింగ్ హోమ్,జీవన శ్రీ,వెన్నెల ఆసుపత్రులను తనిఖీలు చేసారు. అనంతరం నవతెలంగాణ తో మాట్లాడుతూ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఆరోగ్య సంరక్షణ,కాన్పులు నాణ్యతను మెరుగుపరిచే ప్రమాణాలను రూపొందించడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం అని అన్నారు. ఈ బృందంలో డీఐఓ డాక్టర్ బాలాజీ ఉన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రాందాస్, ప్రయివేటు వైద్యులు డాక్టర్ బాబూరావు,డాక్టర్ ఆంజనేయులు,డాక్టర్ పూర్ణచందు లు పాల్గొన్నారు.