కవితా ఓ క‌వితా నీకుజేజేలు

Poetry, a poem for you.ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకోవాలనే నిర్ణయాన్ని మొదటిసారిగా యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కతిక సంస్థ) 1999 వ సం”లో ప్యారిస్‌ లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో ఆమోదించింది. ఆనాటి నుండి ప్రతి ఏడాది మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా యునెస్కో ఒక థీమ్‌ తో ముందుకెళ్తుంది. మార్చి 21, 2025 న ”శాంతి మరియు సమ్మిళితత్వానికి వంతెనగా కవిత్వం” అనే థీమ్‌ ను ఎంచుకుంది. ఇటువంటి కవితా దినోత్సవాలు కవిత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి, కవులను గౌరవించడానికి, కవిత్వ పఠన సంప్రదాయాలను పునరుద్ధరించడానికి, కవితా వ్యక్తీకరణ ద్వారా భాషా వైవిధ్యానికి మద్దతు ఇవ్వడానికి, కవిత్వం చదువడం, రాయడం బోధించడాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక అనుకూల సందర్భం. ఇటువంటి దినోత్సవ వేళ కవిత్వం అంటే ఏమిటి? దాని పూర్వాపరాలు-వర్తమానంలో తీరుతెన్నులు గురించి సంక్షిప్తంగా అవలోకనం చేసుకుందాం.
”అక్షరానికి పాలు తాపి పదం చేయాలి
పదానికి అన్నం పెట్టి వాక్యం చేయాలి
వాక్యానికి శిక్షణ ఇచ్చి కవిత్వం చేయాలి
కవిత్వానికి జీవితాన్నిచ్చి ఆయుధం చేయాలి” అంటూ కవి శక్తిని, కవిత్వం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రకటిస్తాడు కవి త్రిపురనేని శ్రీనివాస్‌. సహజంగానే కవులందరికీ కవిత్వంపై ఎనలేని ప్రేమ, నిబద్ధత, అంకిత భావం, సామాజిక బాధ్యత ఉంటాయి. తద్వారా కవి కలం సజించే కవిత్వం పసిపాపను ఊరడించగలదు. ప్రియురాలిని కవ్వించగలదు. మూలనున్న ముసలమ్మను ఉరికించగలదు. మసి బారిన మనసులను మెరిపించగలదు. కన్నీటి బాధలను కడిగేయగలదు. అజ్ఞానపు మెదళ్ళలలో చైతన్యాన్ని రగిలించనూగలదు. అది కవిత్వ శక్తి. అందుకే ప్రఖ్యాత కవి బాలగంగాధర్‌ తిలక్‌ ”కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు” అని తేల్చి చెప్పాడు. ఆల్కెమీ అంటే లోహాన్ని బంగారంగా మార్చేది, రసవిద్య. తిలక్‌ మాటల్ని బట్టి కవి, కవిత్వ బంగారాన్ని సష్టించగల శక్తిమంతుడు. ఈ సందర్భంగా అందరికీ మార్చి, 21 ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.
కవిత్వం ఒక సజనాత్మక సాహితీ ప్రక్రియ. పురాతన ప్రక్రియ. పద్యం, పదం పాట,గేయం, వచనం అనేవి కవిత్వరూపాలు. రూపం ఏదైనా కవి తాను ఎంచుకున్న రూపంలో పఠితలను వారి వారి కవితా లోకాలకు తీసుకుని పోతుండడం పరిపాటి. నిర్వచన రూపంలో కవిత్వాన్ని తెలపటం నిజానికి కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే కవిత్వం అనుభూతి ప్రధానమైనది. అందువల్ల నిర్వచనం ద్వారా కవిత్వాన్ని అందుకోవడం, అర్థం చేసుకోవడం మామూలు విషయం కాదు. భారతీయ సాహితీవేత్తలు, పాశ్చాత్యులు అనేక విధాలుగా కవిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. ”తీవ్రమైన అనుభూతుల స్వచ్ఛంద విజంభణమే కవిత్వము” అంటాడు పాశ్చాత్య సాహితీవేత్త వర్డ్స్‌ వర్త్‌. ”వచనం లాగా భాసించే మాటల్లో కవితా స్వభావమైన భావానుభూతిని కలిగించే ప్రయత్నం వచన కవిత్వం. ఛందోరహితమైన, కేవలం వచనంలో భావ,లయ ప్రధానంగా పలికే కవిత్వాన్ని వచన కవిత్వమని” స్థూలంగా నిర్వచించారు కవి ఆరిపిరాల విశ్వం. ఈ నిర్వచనాలను బట్టి కవిత్వంలో వస్తువు, రూపం,శైలి,రీతి, వర్ణన,ధ్వని మొదలైనవి ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కవి హదయాన్ని కదిలించిన భావం కవిత్వవుతుంది. ఒక కాలానికి చెందిన కవిత్వం ఆనాటి సంస్కతికి, వ్యక్తుల ఆలోచనారీతులకు, సామాజిక పరిస్థితులకు చారిత్రక ఆనవాలుగా నిలుస్తుంది. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కాన్వాస్‌ గా చేసుకొని కవులు కవిత్వాన్ని అల్లుతుంటారు. నన్నయ, పాల్కురికి సోమనలు మొదలుగా నేటి వరకు సజీవ స్రవంతిగా సాగుతున్న తెలుగు సాహిత్య పరిణామక్రమంలో కవిత్వం ఒక జీవనది.
ప్రాచీన కాలంలోని పద్యం, పదం, పాట, గేయమైనా, ఆధునిక వచన కవిత్వమైనా అందులోని కవిత ప్రధానంగా మానవ జీవితాన్నే చిత్రిస్తూ వస్తుంది. కాకపోతే ప్రాచీన కాలానికి చెందిన కవిత్వంలో వర్ణన పాత్ర ఎక్కువ. కవి కావ్యం రాసినా, కవిత రాసినా దానికి ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించడం సహజం. అయితే కవులంతా సంఘ భాగస్వాములే. కాబట్టి సంఘ స్థితిని తమ తమ కవిత్వంలో ప్రతిబింబిస్తూ సజనలు చేసినప్పుడు ఆ కవితా ప్రయోజనం గొప్పగా ఉంటుంది. ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది. ఆ విధంగా కవిత్వ పరిణామ క్రమంలో పద్యం, పదం, పాట, గేయం, వచనం వాహిక ఏదైనా ఒక కాలానికి చెందిన ప్రజల జీవిత గమనానికి సూచికగా కవిత్వం నిలిచింది. తర్వాత తరాలకు అనుభవ పాఠాలనెన్నింటినో అందించింది.
ఈ క్రమంలో ప్రాచీన సాహిత్యంలోని కవిత్వం ప్రేమ, ఆదర్శాలు, విలువలు, మానవతా స్ఫూర్తి సంబంధిత అంశాలను చిత్రించినప్పటికీ తెలుగు కవిత్వంలో ఛందస్సులనే ఇనుప తొడుగులను నిరసిస్తూ వాడుక భాష ప్రాధాన్యత పెరిగింది. తద్వారా ఆధునికాంధ్ర కవిత్వంలో కొత్త భావనలకు అంకురార్పణ జరిగింది. 20వ శతాబ్దం ఆరంభం నాటికి కందుకూరి వీరేశలింగం సంఘసంస్కరణోద్యమం, గిడుగు రామ్మూర్తి భాషా సంఘసంస్కరణోద్యమం, గురజాడ అప్పారావు సాహిత్య సంస్కరణ ఉద్యమాలు తెలుగు సాహిత్యంలో కొత్త బాటలు వేశాయి. సామాజిక, భాషా సాహిత్య, ఛాందసవాదాలను కేవలం నిరసించడంతో ఆగిపోని ఈ వైతాళికుల కషి తెలుగు సాహిత్యంలో భావ విప్లవాన్ని, భాషా విప్లవాన్ని ప్రజ్వలించింది. ఫలితంగా కొత్త కొత్త సాహిత్య ప్రక్రియలలో, భిన్న అభివ్యక్తులతో కవిత్వం సామాన్యుడిని సైతం చేరగలిగింది. నిర్బంధాల నడుమ నుండి స్వేచ్ఛా ప్రియత్వం ఆధునిక కవిత్వ లక్షణమైంది. ఈ ధోరణి క్రమంగా ఆంగ్ల కవిత్వ ప్రభావంతో, ముఖ్యంగా షెల్లీ, కిట్సు ,బైరన్‌ మొదలైన పాశ్చాత్యుల రచనల ప్రభావం వల్ల, ప్రాచీన సాహిత్య అంతస్సారాన్ని గ్రహించడం వల్ల, తెలుగు సాహిత్యంలో రాయప్రోలు సుబ్బారావు వంటి కవుల ద్వారా కాల్పనికోద్యమంగా పరిణమించింది. 1910 వ సం” నాటికి ఒక విలక్షణమైన పంథాలో సాగిన తెలుగు సాహిత్య పునరుజ్జీవనం చైతన్యమే భూమికగా ఎన్నో కవిత్వ ఉద్యమాలకు వేదిక అయింది. తద్వారా వచన కవిత సర్వతోముఖ వికాసం చెందింది.
ఆంగ్లభాషాసంపర్కం వల్ల ఆధునిక కవిత్వంలో ప్రాణం పోసుకున్న ప్రక్రియ లిరిక్కు. దీని భావ కవిత్వం(లిరికల్‌ పోయెట్రీ) అని సాహితీవేత్తలు పేర్కొంటారు. ఆధునిక కవిత్వంలో అన్నింటికంటే ముందు ఒక ఉద్యమ రూపం దాల్చి ఎంతో మంది కవులను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం భావ కవిత్వోద్యమం.
”సౌరభములేల చిమ్ము పుష్ప వ్రజంబు!
చంద్రికల నేల వెదజల్లు చందమామ!
ఏల సలిలంబు పారు! గాడ్పేల విసరు
ఏలనా హయంబు ప్రేమించు నిన్ను”అంటూ దేవులపల్లి కష్ణశాస్త్రి ప్రకతి పరిణామాల సహజత్వంతో ప్రేయసి ప్రేమ సహజత్వాన్ని కవిత్వీకరించారు.
ఈ విధంగా భావకవిత్వంలో ప్రకతి, శంగారం, విరహం-వేదన, భక్తి, దేశభక్తి సంఘసంస్కరణ, సామాజిక స్పహ ఇత్యాదులతో వచన కవిత జయకేతనం శాఖోపశాఖలుగా విస్తరించింది. క్రమంగా ప్రజల జీవితమే ప్రమాణంగా సాహిత్య గమనం ఉండాలనే మానవాభ్యుదయ స్పహతో మార్క్సిజం ప్రభావంతో అభ్యుదయ కవితకు దారులు తెరుచుకున్నాయి.
”నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవష్టికి అశ్రువొక్కటి ధారపోశాను”అంటూ శ్రీశ్రీ జయభేరిలో కవితా ఘంటిక మ్రోగించాడు. వ్యక్తి చైతన్యం తద్వారా సమూహ చైతన్యం కోరుకుంటూ ప్రజా ప్రయోజనం కోసం అభ్యుదయ కవిత్వం పాటుపడింది.
కాలానుగుణంగా కవితా లోకంలో ఏర్పడిన నైరాశ్యం, స్తబ్దతలను తొలగిస్తూ కొంత చైతన్యాన్ని కలిగించడానికి దిగంబర కవులు రంగ ప్రవేశం చేశారు.
”అడుగు అడుగులో సహారా ఎడారి
ప్రపంచంలో ప్రతి ఒక్కడి శిరస్సు మీద ఒక్కొక్క హిమాలయం
నీ ఆశయం సూర్యున్ని మాత్రం పిడికిట్లోంచి జారవిడవకు
ప్రాణాన్ని పణం పెట్టయినా ఈ జగతికి మానవతాభిక్షపెట్టు”అంటూ చెరబండ రాజు వంటి దిగంబర కవులు సమాజంలోని అక్రమాలపై అన్యాయాలపై విరుచుకుపడ్డారు.
సామాజిక,రాజకీయ, ఆర్థిక పరిణామాల క్రమంలో సమాజంలో అంతకంతకూ పెరుగుతున్న దుర్మార్గాలు, అసమానతలను, అమానవీయతను, ప్రతిఘటిస్తూ విప్లవించక తప్పని పరిస్థితులు ఉన్నప్పుడు విప్లవాభిముఖంగా ప్రజలను చైతన్య పరచడం అనివార్యమని భావిస్తూ విప్లవం కవిత్వం వచ్చింది. ”ఆగ్రహం కొరడాని చేబూని
సాయుధ విప్లవ బీభత్సుని సారథినై
భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీత ఝంఝని ప్రసరిస్తాను
మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను”అంటూ శ్రీశ్రీ ప్రజల హక్కుల కోసం ఉద్భవించిన విప్లవ కవిత్వంలో శివసాగర్‌, సుబ్బారావు పాణిగ్రాహి, గద్దర్‌, కె.శివారెడ్డి, విజయలక్ష్మి వంటి ఎంతోమంది కవుల కవిత్వం ప్రజలను చైతన్యపరిచింది.
తర్వాత కాలంలో సమాజంలోని అన్ని రంగాలలో స్త్రీలకు సమాన భాగస్వామ్యం ఉండాలని, స్త్రీల జీవితాలు కొందరి చెప్పు చేతలకు లోబడి ఉండే పరిస్థితులు మారాలని, పురుషాధిపత్య భావజాలం అంతరించాలని ఫెమినిజం పేరుతో స్త్రీవాద కవిత్వం మహిళాలోకాన్ని చైతన్య పరిచింది.”ఇన్నాళ్లూ గలగల మాట్లాడితే/ నే చెప్పాల్సిందేమీ లేనందున/ నేనేం చెప్పినా విన్నారు/ఇప్పుడేమో నాకు చెప్పాల్సిందేదో ఉండి/మాట్లాడబోతే ఎవరూ వినిపించుకోరు/అందుకో మరెందుకో ఈ గొంతు మూగవోయింది”- శిలాలోలిత.
పితస్వామ్యం, జెండర్‌, అణచివేతలు, ఇంటి చాకిరి స్వభావం మొదలైన విషయాలపై ఓల్గా, పాటిబండ్ల రజని, రజియా బేగం, జయప్రభ అంటే ఎంతో మంది కవయిత్రులతోపాటు కవులు కూడా తమ నిరసనను కవిత్వంతో తెలిపారు.
పంచమ కులస్థులుగా ముద్ర వేసి, ఊరికి దూరంగా నెట్టి, వారి పట్ల అస్పశ్యతను చూపుతున్న పరిస్థితులకు చరమగీతం పాడుతూ దళిత కవిత్వం వచ్చింది.
”నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపురేఖాకమనీయ వైఖరుల గాంచి బళిబళి యన్నవాడె, నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో”అంటూ గుర్రం జాషువా కులపు వెక్కిరింతలపై ఆవేదన చెందుతూ వర్ణ వ్యవస్థ క్రూరత్వాన్ని కవితా అక్షరాలతో కడిగిపారేసాడు. కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్‌, ఎండ్లూరి సుధాకర్‌ మొదలగు కవులెందరో దళిత సమస్యలను తమ కవితల ద్వారా ఎండగట్టారు. ఆలోచనాత్మక చర్చలను కవిత్వం ద్వారా లేవనెత్తారు.
ఇదే క్రమంలో బీసీలు కూడా తమకూ సమస్యలు ఉన్నాయని తమ పరిస్థితుల గురించి కవితాగానం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
”అగ్గిపెట్టెలు ఆరున్నర గజాల పద్యాన్ని/మడత పెట్టిన ఆదిమకళాకారుడువి.. అంటూ ఎన్‌ .గోపి,
నేను గొర్రెల్ని కాస్తుంటాను/మంద నా గురుకులం అంటూ బెల్లి యాదయ్య ఒంటి కవులు బీసీల సమస్యలను కవిత్వంలో ఏకరువు పెట్టారు.
”ఇక ఎలాంటి కుట్రా చెల్లుబాటు కాదు”అంటూ యాకూబ్‌ పాషా ఒంటి కవులు మైనార్టీల సమస్యలను కవిత్వంలో ప్రకటించారు. ఇలా కవిత ఒక్కటేమిటి ప్రాంతీయ, అస్తిత్వ, అనుభూతి, జాతీయత, మానవత, స్మతుల జలపాతమై తన హౌరును ఆనాటి నుండి నేటి వరకు వినిపిస్తూనే ఉంది. తెలుగు కవిత రాశిలోనూ, వాసిలోనూ తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. అత్యాధునిక వస్తువులతో అలరారుతూనే ఉంది. ”కవి ఎప్పటికప్పుడు కొత్తగా పలకటానికి/ ఆత్మా రణ్యంలో అజ్ఞాతవాసం చేస్తాడు” అని నందిని సిద్ధారెడ్డి అన్నట్లుగా కవులు నిరంతర విద్యార్థులై కవిత్వంలో కొత్త కొత్త వ్యూహాలతో ఎప్పటికప్పుడు సమాజ కన్నీళ్లను కలంతో నరుకుతూ, జనం గుండెల్లో కవిత్వంతో చైతన్య దీపాలను వెలిగిస్తూ సాగుతున్నారు. అయితే నేటి కొందరు వర్తమాన కవులు కవిత్వంలో ఎంచుకుంటున్న వస్తువులను మినహాయిస్తే, సమకాలీనతను ప్రతిబింబించడం, కవిత్వ రూపాన్ని గురించి పట్టించుకోవడం ఆవశ్యకం అనిపిస్తుంది. అప్పుడే కవిత్వం శతాబ్దాలు దాటినా జనం నాలుకలపై నర్తిస్తుంది. ఏది ఏమైనా ప్రపంచం నలుమూలలా కవిత్వం పరిమళభరితమై వర్ధిల్లుతూ తన పతాకను ఎగురవేస్తూ ఉంది. ప్రపంచ కవితా దినోత్సవమా! నీకు జేజేలు.
– డా. ఉప్పల పద్మ
9959126682

Spread the love