చిన్న బోయిన పెద్ద ప్రాజెక్ట్…

– నాడు గలగల నేడు విలవిల..
నవతెలంగాణ – అశ్వారావుపేట : వర్షాధార వరద నీటి నిల్వ ద్యేయంగా గిరిజన ప్రాంతం రైతులకు 16 వేలు ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో మండలంలోని గుమ్మడి వల్లి సమీపంలో 1975 లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్ట్ గా 40 వేల 500 క్యూసెక్కుల నిల్వ సామర్ధ్యం తో 3 గేట్ లు, 2 సాగు నీటినీ కాలువలు తో నిర్మాణం చేపట్టారు.ఆరు సంవత్సరాల అనంతరం 1981 లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ తో అశ్వారావుపేట,కుక్కునూరు,వేలేరుపాడు మండలాల్లోని అనేక గ్రామాల్లో ని రైతులు వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందారు. 1989 లో ఒక సారి అధిక వర్షపాతం తో కూడిన వరదలతో ఈ ప్రాజెక్ట్ కు గండి పడి ఆస్తినష్టం,పశుసంపద నష్టం సంభవించింది. అనంతరం 2014 లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడటంతో భౌగోళికంగా ఈ ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ గా గోదావరి రివర్ అధారిటీ అధీనంలోకి వెళ్ళింది.ఈ నేపధ్యంలో ప్రాజెక్ట్ తో పాటు 2360 ఎకరాలు ఆయకట్టు  తెలంగాణ భూభాగంలో లో ఉండటం 13640 ఎకరాల ఆయకట్టు ఆంధ్రా భూభాగంలో విలీనం అయింది.ఈ ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతాలు అయిన
కుక్కునూరు,వెలేరుపాడు మండలాలు పోలవరం నిర్వాసిత మండలాలు కావడంతో ఈ రెండు రాష్ట్రాలు సైతం ఈ ప్రాజెక్ట్ నిర్వహణ పై శ్రద్ద చూపలేదు.దీంతో ఈ ప్రాజెక్ట్ లో పూడిక చేరడం,గేట్ లు మరమ్మత్తులకు గురికావడం అనివార్యం అయింది. ఈ క్రమంలో గతేడాది అంటే 2024 సెప్టెంబర్ లో వచ్చిన అధిక వర్షాలకు అత్యధిక వరదలు సంభవించడంతో ప్రాజెక్ట్ కు గండి పడింది. వెంటనే స్పందించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రింగ్ బండ్ తో తాత్కాలిక మరమ్మత్తులు చేయించారు.అయినా అనంతరం సంభవించిన వర్షాలకు అది సైతం కొట్టుకుపోయింది.
ప్రస్తుతం 1 లక్షా 50 వేల క్యూసెక్కుల నీటి సామర్ధ్యం తో మొత్తం మొత్తం 8 గేట్ లు తో పునర్నిర్మాణానికి రూ.92 కోట్లు 50 లక్షల నిధులతో అధికారులు ప్రతిపాదనలు నివేదిక ను ఆ శాఖ ఉన్నతాధికారులకు అందజేసారు. ఈ నేపద్యం లో ఎస్సీ ఎస్టీ కమీషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ ఈ ప్రాజెక్ట్ సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Spread the love