చక్రమావిష్కరణ.. చరిత్రలో సజనాత్మక మైలురాయి..
మానవ జీవితాన్ని మలుపు తిప్పిన అనూహ్య ఘటన..
ఆనందాశ్చర్య పరిణామం..!
మట్టి పాత్రలు వానే క్రమంలోనే కొత్త శాస్త్రాల పుట్టుక..
అలనాటి నాగరికతలకు ఆనవాళ్లు
కుమ్మరన్న చేతినుంచి పుట్టుకొచ్చిన మట్టి పాత్రలే!
ఐదు శతాబ్దాల కావల ఆ సజన చేతుల్లోంచే
ఉదయించిందో వెలుగుకిరణ
మట్టిశిల్పి కేసనశెట్టి కడుపున పుట్టిందో
మాణిక్యం మొల్లమాంబ .!!
‘మొల్ల’ అంటేనే మల్లెపువ్వు
ఆ కమనీయ రమణీయ పరిమళాన్నీ
తేనె లొలుకు తీయదనాన్ని మేళవించి
కవితలల్లిన తొలి తెలుగు విదుషీమణి మొల్లమాంబ..!
అగ్రవర్ణ పండితులకు తప్ప
అన్యులకందని సాహితీఫలాల ప్రబంధ కాలమది..!
సంస్కతాదికావ్యాన్ని తేట తెలుగునకనువదించి..
సర్వజనులకు పంచిన తొలికవయిత్రి మొల్లమాంబ..!
శబ్దాడంభరాల జోలికెళ్ళక పద గుంఫనాలను పట్టితెచ్చి గుప్పించక..
అలతియలతి పదాలతో అక్షర సారే తిప్పి
రామగాథని రసరమ్య కావ్యంగా వినతికెక్కించెను మొల్లమాంబ..!
ఊహించనలవి కాని తొవ్వ..
శూద్రులకు చదువు లెందుకన్న నోళ్లు..
చదివిన నాలికలపై సీసము పూసిన వేళ్ళు..
మట్టి కులాన పుట్టిన ఆడబిడ్డ..
ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని అవహేళనలు
ఎంత చిన్నచూపు
ఎదురొడ్డి కలము పట్టిన ధీరవనిత..
ముండ్ల కంప మీద వికసించిన
కట్లపువ్వే మొల్లమాంబ..!
కీర్తి కిరీటాలు, పసిడి కానుకల నాశించి
తమ కతులను రాజులు రారాజులకు
అంకితమిచ్చెటి రోజులవ్వి..!
శ్రీ కంఠదత్తుని వరంబు చేతనే కలంబు
పట్టితినని..నియ్యతి మరువక
తా విరచిత రామాయణ కావ్యాన్ని
రామచంద్రుడి పాదాలకే అంకితమిచ్చిన
సహజ కవయిత్రీ మొల్లమాంబ..
నీదు కీర్తి చంద్రికలు ఆచంద్ర తారార్కం వెల్లివిరియు
తల్లీ మొల్లమాంబ ..!!
– నాంపల్లి సుజాత (అన్నవరం)