వాషింగ్టన్ : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)ను విక్రయించినట్లు ఎలన్ మస్క్ వెల్లడించారు. అయితే దీన్ని తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయినటువంటి ‘ఎక్స్ఎఐ’కే 33 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.2.82 లక్షల కోట్లు)కు అమ్మేసినట్లు ‘ఎక్స్’ వేదికగా మస్క్ ప్రకటించారు. ఈ లావాదేవీ పూర్తిగా స్టాక్ రూపంలో జరిగిందన్నారు. తాజా స్వాధీనంతో ఎక్స్ఎఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధారించారు. 2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (రూ.3.76 లక్షల కోట్లకు)కు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఆ సంస్థలతో అనేక మార్పులు చేయడంతో పాటుగా ట్విట్టర్ పేరును కూడా ఎక్స్‌గా మార్చారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించి వారిని రోడ్డున పడేశారు. చాట్‌జిపిటికి పోటీగా గతేడాది మస్క్ ‘ఎక్స్ఎఐ’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎక్స్ఎఐ అధునాత ఎఐ సామర్థ్యాన్ని, ఎక్స్‌కు అనుసంధానించడం ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని మస్క్ తన పోస్టులో పేర్కొన్నారు.