
– ఇకనుండి పార్టీలో కోవార్డు రాజకీయాలకు స్థానం లేదు
– కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి
– రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ – రాయపర్తి
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని 27న ఓరుగల్లు గడ్డమీద జరగనున్న రజతోత్సవ సభలో చాటాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రజతోత్సవ సభ జనాభా సమీకరణంకై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేయాలని విన్నవించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. సంబ్బండ వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. నాడు ప్రజలు అందుతున్న సంక్షేమ ఫలాలతో సంతోషంగా ఉండేవారని నేడు రైతన్నలు మొదలు ప్రతి ఒక్క రంగానికి చెందిన వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీదే హవా అన్నారు. ఇకపై పార్టీలో కోఆర్టు రాజకీయాలకు స్థానం లేదు అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే బాగుండేదని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. రానున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి రజితోత్సవ సభ నాందిగా నిలవాలని వ్యాఖ్యానించారు. గ్రామ గ్రామం నుండి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో మండల పార్టీ ఇంచార్జి గుడిపూడి గోపాల్ రావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఎస్టి కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు గారె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.